Print Media: “కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని.. ఏసీ గదిలో సేదతీరుతూ న్యూస్ పేపర్ నడిపిస్తే పెద్ద కిక్కు ఉండదు. పాత్రికేయుడు మాత్రమే కాదు, యజమానికి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలిసి ఉండాలి. ఎప్పటికప్పుడు ఉప కార్యాలయాలను పరిశీలిస్తూ ఉండాలి. పర్యవేక్షిస్తూ ఉండాలి. అప్పుడే పత్రిక మరింతకాలం మనగలుగుతుంది” సుప్రసిద్ధ ఇండియన్ ఎక్స్ ప్రెస్ అధిపతి రామ్ నాథ్ గోయంక సిబ్బందితో ఇలానే చెబుతుండే వారట.
ఆ మాటలను ఆకలింపు చేసుకున్నారేమో.. ఓ పత్రికాధిపతి జిల్లాల బాట పట్టారు. సుదీర్ఘకాలం తర్వాత జిల్లా కార్యాలయాలను పరిశీలిస్తున్నారు. సిబ్బందితో మాట్లాడుతున్నారు. సర్కులేషన్ పెంచుకోవడం ఎలా అనే అంశాలపై చర్చిస్తున్నారు. ఆయన మాత్రమే కాకుండా పత్రికలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తులను కూడా జిల్లా కార్యాలయాలకు తీసుకెళ్తున్నారు. “మనం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు. అలాగని వ్యతిరేకంగా ఉండకూడదు. వ్యతిరేక వార్తలు రాస్తున్నప్పుడు ఖచ్చితమైన ఆధారాలు ఉండేలా చూసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు ఏర్పడితే అది సంస్థ పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఆర్థికంగా కూడా నష్టం చేకూర్చుతుంది. ఈ విషయాన్ని మననంలో పెట్టుకుని పని చేయండి.. సర్క్యులేషన్ కచ్చితంగా పెంచాల్సిందే.. పోటీ పత్రికను కచ్చితంగా బీట్ చేయాల్సిందే. మీకు ప్రతి ఒక్కరికి మూడు వేల వరకు జీతం పెంచుతాం. సర్కులేషన్ మాత్రం హైక్ అవ్వాల్సిందే” నంటూ సిబ్బందికి ఆ పత్రికాధిపతి స్పష్టం చేస్తున్నారట. చాలాకాలం తర్వాత తమ సంస్థ అధిపతి సమావేశం నిర్వహించడం.. సంస్థ పురోగతికి తీసుకోవలసిన చర్యలను చర్చించడం పట్ల ఇది స్థాయి సిబ్బంది ఉబ్బి తబ్బిబవుతున్నారట. ఆ పత్రికాధిపతితో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారట. వాట్సప్ డీపీలుగా పెట్టుకొని సంతోషిస్తున్నారట.
సర్కులేషన్ పెంపుదల సాధ్యమేనా
పత్రికలకు ఇప్పుడున్నవన్నీ మంచి రోజులు కాదు. అక్కడిదాకా ఎందుకు ఆడిట్ బ్యూరో కౌన్సిల్ నుంచి ప్రఖ్యాత మలయాళ పత్రికలు మాతృభూమి, మలయాళ మనోరమ తప్పుకున్నాయి. ఫలితంగా తెలుగులో మొదటి, రెండు స్థానాల్లో ఉన్న పత్రికలు జాతీయస్థాయిలో ఐదు, 8 స్థానాలను ఆక్రమించాయి. ఇంకా కొన్ని పత్రికలు ఆడిట్ బ్యూరో కౌన్సిల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాయి. ఎందుకంటే ముద్రణ వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకప్పటిలాగా న్యూస్ పేపర్ చదవడానికి పాఠకులు అంతగా ఇష్టం చూపించడం లేదు. విశ్రాంత ఉద్యోగులు, ఒక సెక్షన్ రీడర్స్ మాత్రమే పేపర్ చదువుతున్నారు. సోషల్ మీడియా ప్రింట్ మీడియాను సవాల్ చేస్తోంది. పైగా పత్రికా యాజమాన్యాలకు రాజకీయ పైత్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు జనం విరగబడి పత్రికలు కొనుగోలు చేసే రోజులు కావు. ఇకపై వచ్చే అవకాశం కూడా లేదు.
అన్ని సమస్యలున్నాయి.. సాధ్యమవుతుందా?
ఇక ఆ పత్రిక విషయానికి వస్తే.. ఒకవేళ కిందా మీదా పడి సర్కులేషన్ పెంచినప్పటికీ.. సకాలంలో పేపర్ వేయకపోతే రీడర్ కు చిరాకొస్తుంది. దీంతో పేపర్ వేయించుకోవడమే మానేస్తాడు. దీని వెనక అనేక సమస్యలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో సేల్స్ రిప్రెసెంటేటివ్స్ లభించకపోవడం.. పేపర్ వేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం.. పేపర్ పై కమీషన్ పెంచకపోవడం.. సకాలంలో పేపర్ రాకపోవడం.. వంటి కారణాలు సర్కులేషన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ సమస్యలకు ఆ పత్రికాధిపతి ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాల్సి ఉంది. పైగా ఆ పత్రిక సర్కులేషన్ విభాగం పూర్తిగా డల్. ఉద్యోగులకు మూడు వేల వరకు వేతనం పెంచుతామని ఆ పత్రికాధిపతి ఆఫర్ ఇస్తున్నారు. ఇది ఆ ఉద్యోగులకు ఆనందాన్ని కలిగించే విషయమే అయినప్పటికీ.. కోవిడ్ సమయంలో చాలామంది ఉద్యోగులను మెడపట్టి బయటికి గెంటేశారు. ఉన్నవారితో బండ చాకిరి చేయించారు. చివరికి సగం జీతం మాత్రమే ఇచ్చారు. ఇలా ఒక ఏడాది పాటు నరకం చూపించారు. ఆ తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి 1000 రూపాయలు పెంచారు. ఆ తర్వాత 2000 పెంచారు. ఇప్పుడు పెంచుతున్న 3000 నాటి కోవిడ్ రోజుల్లో మినహాయించుకున్నదే అనే ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ 3 వేల పెంపుదల ఈ నెలలో ఉంటుందా? లేక ముందు మీరు పెంచండి.. ఆ తర్వాత మేము పెంచాలో లేదో చూస్తాం అనే తీరుగా ఉంటుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. ఎందుకంటే ఆ పత్రికాధిపతి మాట మీద ఉండరు. సంస్థ(అది ఆయనదే కాబట్టి) ప్రయోజనాలకు మాత్రమే పెద్దపీట వేసే ఆయన.. ఉద్యోగుల విషయంలో ఎన్నడూ ఉదారంగా వ్యవహరించిన రోజులు లేవు. అలాంటి నమ్మకాలూ ఆ ఉద్యోగుల్లో లేవు. కాకపోతే మూడు వేలు పెంచుతామని చెప్పగానే ఏదో ఆశపడ్డారు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఖర్చులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే.