Warangal: ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. దానికి లంచం ఇవ్వడం మహా పాపం.. ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది. చెప్పడానికి ఇది బాగానే ఉంటుంది కానీ.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు ఉండదు. ఇలాంటి అనుభవమే ఈ మహిళకు ఎదురైంది. పైగా సంతకం కోసం ఓ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే.. అతడు లంచం డిమాండ్ చేయడంతో ఆమెకు షాక్ తగిలినంత పనైంది.
ఇప్పటివరకు రెవెన్యూ, నీటిపారుదల, ట్రెజరీ, మునిసిపల్, వైద్యరోగ్య శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్న వార్తలు చూశాం. కానీ ఈ హెడ్ మాస్టర్ తీరు వేరు. తన గెజిటెడ్ సంతకం కోసం ఏకంగా లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇస్తేనే సంతకం పెడతానని స్పష్టం చేశాడు.. దీంతో సంతకం కోసం వెళ్లిన మహిళకు దాదాపు షాక్ తగిలినంత పనైంది.. దీంతో తన గోడును ఆ మహిళ స్థానికులతో చెప్పుకుంది. దీంతో వారు వెళ్లి అతడిని నిలదీయగా.. ముందు నీళ్ళు నమిలాడు. ఆ తర్వాత పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఫండ్ రావడం లేదని.. అందువల్లే తాను డబ్బులు అడిగానని బుకాయించాడు.. స్థానికులు మరింత లోతుగా ప్రశ్నిస్తే.. ఆమె నా విద్యార్థి కాదు. నా స్కూల్లో చదువుకోవడం లేదు. అలాంటప్పుడు నేను సంతకం ఎందుకు పెట్టాలని అతడు ఎదురు ప్రశ్నించాడు.
ఏం జరిగిందంటే..
ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన మహిళ.. తన కూతురు ఆధార్ అప్డేట్ కోసం.. మీసేవ కేంద్రానికి వెళ్ళింది. వారు ఏదో దరఖాస్తు ఇచ్చి.. ఇందులో మీ వివరాలను నింపి.. గెజిటెడ్ అధికారి సంతకం తీసుకొని రావాలని సూచించారు. దీనికి ఆ మహిళ అలానే చేసింది. గెజిటెడ్ అధికారి సంతకం కోసం స్థానికంగా ఉన్న పాఠశాలకు వెళ్లింది.. గెజిటెడ్ సంతకం పెట్టాలని హెడ్ మాస్టర్ ను కోరింది. దానికి అతడు నిరాకరించాడు. సంతకం ఎందుకు పెట్టాలని ఎదురు ప్రశ్నించాడు. ఆమె బతిమిలాడినప్పటికీ కనికరించలేదు..” మీ వాళ్ళు ఎవరైనా నా స్కూల్లో చదువుతున్నారా? అలాంటప్పుడు నేను ఎందుకు సంతకం పెట్టాలి.. మీరు నాకు ఎవరో తెలియదు.. ఇలా సంతకం పెట్టాలి అని అంటే.. నేను ఎందుకు పెడతాను.. సంతకం పెట్టిన దానికి డబ్బులు ఇవ్వండి. అలా అయితేనే నేను ఆ పని చేస్తానని చెప్పడంతో” ఆ మహిళ బాధపడుతూ బయటికి వచ్చింది. ఇదే విషయాన్ని స్థానికులతో చెప్పింది. దీంతో కొంతమంది ఆ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తే.. ఈ విషయం గురించి ప్రస్తావిస్తే.. అతడు ఏ మాత్రం భయపడలేదు. పైగా వితండవాదానికి దిగాడు..”వాళ్ల పిల్లలు నా స్కూల్లో చదవడం లేదు. ఆధార్ అప్డేట్ కోసం నా సంతకం మాత్రమే దొరికిందా.. వేరెవరూ ఇక్కడ లేరా? పాఠశాలకు ప్రభుత్వం నుంచి ఫండ్ రావడం లేదు.. అలాంటప్పుడు మేం మాత్రం ఏం చేయాలి? ఇలాంటివి వస్తేనే పాఠశాలను నిర్వహించడానికి వీలవుతుందని” ఆ హెడ్ మాస్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఫండ్ ఇవ్వకపోతే ఇలా లంచాలు వసూలు చేయాలని చెప్పారా అని స్థానికులు ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పకుండా ఆ హెడ్మాస్టర్ నీళ్లు నమిలాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ వీడియో జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లిందని.. వారు ఆ హెడ్మాస్టర్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఓ మహిళ ఆధార్ అప్డేట్ విషయంలో సంతకం కోసం ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆయన “డబ్బులు ఎంత ఇస్తావని” అడిగారు. స్థానికులు నిలదీస్తే.. పాఠశాలకు ఫండ్ రాలేదు. సంతకం ఎందుకు పెట్టాలని అతడు నిలదీశాడు. pic.twitter.com/ufucJSXN8p
— Anabothula Bhaskar (@AnabothulaB) December 31, 2024