People forgotten Kavitha: ఇప్పటి కాలంలో ఒక నాయకుడు జనాల్లో ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అలా చేయకుండా జనాల్లో నోటిలో నానుతూ ఉండాలంటే కుదరదు. ముఖ్యంగా రాజకీయాలలో అసలు కుదరదు. అంతటి కేటీఆర్ కూడా సొంతంగా సోషల్ మీడియాను నడిపిస్తున్నాడు. పార్టీది మాత్రమే కాదు.. ఇతర చానల్స్ ను కూడా అద్దె ప్రతిపదికన నడిపిస్తూ తనను తాను భావి నాయకుడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గులాబీ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు. చివరికి ఆయన సోదరి కవిత కూడా ఇదే విషయాన్ని ఇటీవల మీడియా సమావేశంలో వెల్లడించారు. కేటీఆర్ గురించి అంతగా మాట్లాడిన కవిత.. తన గురించి మాత్రం పట్టించుకోనట్లు కనిపిస్తోంది.
ఇటీవల భారత రాష్ట్ర సమితి నాయకుల మీద కవిత ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వ్యక్తులు.. ఆమెకు సొంత కుటుంబ సభ్యులు. అయినప్పటికీ వారిపై ఆరోపణలు చేసే విషయంలో కవిత ఏమాత్రం తగ్గలేదు. పైగా ఈసారి డోస్ పెంచారు. అవినీతి, అక్రమాలు, ఇసుక కుంభకోణం.. ఇతర విషయాల గురించి మాట్లాడారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ, బిజెపి చేయాల్సిన ఆరోపణలను ఆమె చేశారు. తద్వారా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఓ వర్గం మీడియా కవిత వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ రెండు రోజులు మాత్రమే తెలంగాణ రాజకీయాలలో కవిత గురించి చర్చ జరిగింది. ఆ తర్వాత ఆమె గురించి మీడియాలో పెద్దగా వార్తలు వచ్చిన దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో కూడా అంతే. మరోసారి కవిత వెలుగులోకి వచ్చి ఏదైనా మాట్లాడితే తప్ప అప్పటిదాకా మీడియా ఆమె గురించి పట్టించుకోదు. సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
కవిత ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. ఆమె వ్యాఖ్యలను బలంగా జనాలకు తీసుకెళ్లవలసిన పీఆర్ టీమ్ సైలెంట్ అయిపోయింది. వాస్తవానికి కవితకు అంత గొప్ప పీఆర్ టీమ్ ఉన్నట్టు కనిపించడం లేదు. కనీసం ఆమె గురించి పత్రికలలో రాసేవారు.. టీవీలలో చెప్పేవారు కరువయ్యారు. ఒకవేళ టీవీలలో జరిగే చర్చా వేదికలకు వెళ్లేవారు అంతగా కవిత గురించి గొప్పగా చెప్పడం లేదు. ఇవన్నీ కూడా కవితకు ప్రధాన అవరోధంగా మారిపోయాయి. దీనికి తోడు కవితను కాంగ్రెస్ పార్టీ, బిజెపి ఒక ఆట ఆడుకుంటున్నాయి. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నాయి.
ఇక కవిత ఇటీవల ఆరోపణలు చేసిన తర్వాత హరీష్ రావు విదేశాల నుంచి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత రెస్పాండ్ అయ్యారు. కవిత మాదిరిగా మాట్లాడకుండా హుందాతనాన్ని ప్రదర్శించారు. దీంతో కవితకు రావలసిన సానుభూతి సిద్దిపేట ఎమ్మెల్యేకి వచ్చింది. దీంతో కవిత తొందరపడ్డారని.. అనవసరంగా విమర్శలు చేశారని.. ఆ మాటలు మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే బాగుండేదని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.