Harish Rao Jubilee Hills By Election: తెలంగాణలో జూబ్లీహిల్ ఉప ఎన్నికను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ శ్రమిస్తోంది. ఇక అధికారంలో ఉన్నాం కాబట్టి.. ఆ సీటు తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ఉవ్విల్లూరుతోంది. ఇక బీజేపీ కూడా మేమూ పోటీలో ఉన్నామని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ట్రబుల్‌షూటర్‌గా గుర్తింపు ఉన్న హరీశ్‌రావు మళ్లీ ప్రచారంలోకి వచ్చారు. ఇటీవల ఆయన తండ్రి చనిపోవడంతో 11 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీతానై నడిపించారు. ఈ సమయంలో హరీశ్‌రావు తిరిగి రంగంలోకి దిగడం పార్టీకి కొత్త ఊపునిచ్చింది.
కుటుంబ విషాదం తరువాత..
కొద్దిరోజుల క్రితం తన తండ్రిని కోల్పోయినా, హరీశ్‌రావు ప్రశాంతంగా, పబ్లిసిటి లేకుండా కుటుంబ కర్మకాండలు పూర్తిచేశారు. ఎనిమిదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన తన తండ్రి అనుభవాలను ఎప్పటికీ రాజకీయ ప్రచారంలో ఉపయోగించలేదు. ఇది హరీశ్ వ్యక్తిత్వానికి సూచికగా చాలామంది వర్ణిస్తున్నారు. దశదిన కర్మ పూర్తయిన వెంటనే ఆయన మళ్లీ ఎన్నికల పనులకు తిరిగిరావడం పార్టీ కేడర్‌కు ఆత్మవిశ్వాసం కలిగించింది.
కేసీఆర్ దూరం…
అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటివరకు బహిరంగ ప్రచారానికి రాకపోవడం, కవిత విదేశాల్లో ఉండటం వల్ల పూర్తి బాధ్యత కేటీఆర్ భుజాన వేసుకున్నాడు?ఈ నేపథ్యంలోని హరీశ్ రీ–ఎంట్రీ పార్టీకి పెద్ద ఉపశమనం తెచ్చింది. ఇద్దరి మధ్య ఉన్న అవగాహన, వ్యూహాత్మక అనుభవం పార్టీ బలానికి పునర్నిర్మాణ శక్తిగా నిలుస్తుందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
ప్రచార వ్యూహం బలపడుతుంది
హరీశ్ చేరికతో జూబ్లీహిల్స్ ప్రచారం మరింత క్రమబద్ధంగా మారింది. కేటీఆర్‌తో సమన్వయంగా ఆయన సమావేశాలు, మద్దతు స్వరాలను బలపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాంతీయ అభివద్ధి, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల కొనసాగింపు అనే రెండు ధ్రువాలపై ప్రచారం నడుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కేవలం ఒక స్థానిక పరీక్ష కాదు. ఈ ఎన్నికల ద్వారా బీఆర్‌ఎస్ పునఃవ్యవస్థీకరణ, నాయకత్వ సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. హరీశ్ తిరిగి కేటీఆర్‌తో జోడీ కట్టడమే ఆ ప్రతిస్పందనకు ప్రతీకగా మారింది.