Harish Rao: ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో శాసనమండలి మాజీ సభ్యురాలు కల్వకుంట్ల కవిత నీటిపారుదల శాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వల్లే పార్టీ ఓడిపోయిందని.. పార్టీని చీల్చాలని చూస్తున్నారని.. ప్రత్యర్థి పార్టీల నాయకులతో టచ్ లో ఉన్నారని.. గత ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు సొంతంగా డబ్బు సహాయం చేశారని.. అవకాశం వస్తే చక్రం తిప్పాలని భావించినట్టు.. కవిత ఆరోపించారు. కవిత చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో సంచలన సృష్టించాయి. కవిత వ్యాఖ్యలకు ఓవర్గం మీడియా విపరీతమైన కవరేజ్ ఇచ్చింది. అదే సమయంలో ఓవర్గం మీడియా కవిత వ్యాఖ్యలను తప్పు పట్టింది.
Also Read: కవిత కోపం హరీశ్‌పై కాదా.. మరి టార్గెట్ ఎవరు?
కవిత చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు హరీష్ రావు వర్గీయులు మాత్రమే మాట్లాడారు. భారత రాష్ట్ర సమితిలో కొంతమంది నాయకులు కూడా మాట్లాడినప్పటికీ కవిత వ్యాఖ్యలకు సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వలేదు. దీంతో కవిత చేసిన ఆరోపణలు మొత్తం నిజం అనే తీరుగా తెలంగాణలో చర్చ మొదలైంది. మరోవైపు జాగృతిలో పనిచేసిన వారంతా కవితకు వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలుపెట్టారు. తమ కెసిఆర్ కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు. ఇదంతా జరుగుతుండగానే సడన్గా సీన్లోకి హరీష్ రావు ఎంట్రీ ఇచ్చారు.
హరీష్ రావు ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. లండన్ లో ఉన్న గులాబీ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అక్కడ గులాబీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత చేసిన ఆరోపణలకు సంబంధించి హరీష్ రావు మాట్లాడారు..” గులాబీ పార్టీలో సుప్రీం కెసిఆర్ మాత్రమే. పార్టీలో జరిగే ప్రతి నిర్ణయం ఆయన ఆదేశాల మేరకే ఉంటుంది.. ఇందులో మా ప్రమేయం ఉండదు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో మూడు పిల్లర్లు కుంగిపోయినందుకే రాద్ధాంతం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టడం ద్వారా మేడిగడ్డను వినియోగంలోకి తీసుకురావచ్చు. వానకాలంలో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. బాహుబలి మోటార్లు ఉపయోగించి నీటిని ఎత్తిపోసుకోవచ్చు. కేసీఆర్ మాకు ప్రజలకు సేవ చేయడమే నేర్పించారు. పార్టీ ఎవరి విషయంలోనైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని వెనుక కేసీఆర్ ఉంటారు. అందులో ఎవరి ప్రమేయం ఉండదు. రేవంత్ పరిపాలన వల్ల ప్రవాస తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. పెట్టుబడులు పెట్టకపోతే అభివృద్ధి సాధ్యం కాదు కదా” అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అయితే కవిత చేసిన ఆరోపణలకు హరీష్ రావు ఒకే ఒక సమాధానం ఇచ్చారు. శాసనమండలి మాజీ సభ్యురాలి సస్పెండ్ వెనుక తమ ప్రమేయం లేదని.. కెసిఆరే చేశారని స్పష్టత ఇచ్చారు. మరి దీనిపై కవిత ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.