Harish Rao Comments On Gurukula School Controversy: అది జనగామ జిల్లా. పాలకుర్తి మండలం లోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల. ఆ పాఠశాలలో వార్డెన్ గా పనిచేస్తున్న వ్యక్తి ట్రాన్స్ జెండర్లను పిలిపించాడు. వారు గురుకులానికి వచ్చారు. ఆ తర్వాత ఏ పూజలు చేశారు. ఆ పూజల్లో వార్డెన్, గురుకుల సిబ్బంది పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా సాగింది.
ఈ వ్యవహారాన్ని మాజీ మంత్రి హరీష్ రావు వెలుగులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా సంచలనం నెలకొంది. గూడూరు గురుకులంలో వార్డెన్ గా మల్లీశ్వరి, మరికొందరు పనిచేస్తున్నారు. ఆదివారం వార్డెన్ మల్లీశ్వరి, ఇంకా కొందరు అనుమానాస్పదంగా ప్రవర్తించారు. ఆదివారం అక్కడి విద్యార్థినులను గదులలోకి వెళ్లాలని సూచించారు. పెద్ద సార్లు వస్తున్నారని చెప్పారు. ఎవరూ బయటికి రావద్దని హెచ్చరించారు.
అదే రోజు రాత్రి వార్డెన్, సిబ్బంది కొంతమంది ట్రాన్స్ జెండర్ల ను గురుకులంలోకి తీసుకొచ్చారు. పసుపు, ఏవేవో పూజలు చేశారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలను అక్కడ ఏర్పాటు చేశారు. నీటిలో పసుపు, కుంకుమ కలిపి మంత్రాలు చదివారు. ఆ నీటిని తరగతి గదులలో చల్లారు. విద్యార్థినుల తలపై కూడా చల్లారు. ఈ ఘటనతో విద్యార్థినులు ఒక్కసారిగా భయపడ్డారు. అంతేకాదు వారంతా మరుసటి రోజు రోడ్డుమీదికి వచ్చి ధర్నా చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. సమస్య తీవ్రతను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ గురుకులానికి ప్రిన్సిపాల్ గా రేణుక వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రస్తుతం సెలవులో ఉన్నారు. వార్డెన్ ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.
పరవైపు ఈ వ్యవహారాన్ని హరీష్ రావు తెరపైకి తీసుకువచ్చారు. గూడూరు గురుకులంలో ఉపాధ్యాయులు లేరని.. విద్యార్థులకు భోజనం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. గురుకులంలో క్షుద్ర పూజలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థులు నేరుగా రోడ్డుమీదికి వచ్చి ధర్నా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.