Rythu Bharosa: రైతు భరోసా కొందరికే.. ఈ మార్గదర్శకాలతో షాకిచ్చిన రేవంత్ రెడ్డి?

ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా అర్హులకు అందినప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ అందించింది. దీంతో ఈ నిధులు పక్కదారి పట్టాయి.

Written By: Raj Shekar, Updated On : June 26, 2024 10:39 am

Rythu Bharosa

Follow us on

Rythu Bharosa: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఖరీఫ్‌ సాగు మొదలైంది. పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి అర్హులకే రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మంగళవారం(జూన్‌ 25న) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈమేరకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొత్త మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.

అర్హులకే పెట్టుబడి..
ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైనా అర్హులకు అందినప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ అందించింది. దీంతో ఈ నిధులు పక్కదారి పట్టాయి. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, కొండలు, గుట్టలకు కూడా రైతుబంధు సాయం అందింది. ఈ నేపథ్యంంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఈసారి అర్హులకే రైతుబంధు అందించేలా మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. పూర్త పారదర్శకంగా రైతుభరోసా స్కీమ్‌ అమలుచేస్తామని తెలిపింది.

గ్రామాల వారీగా వివరాల సేకరణ..
రైతుభరోసా అందించేందుకు ప్రభుత్వం గ్రామాల వారీగా సాగుభూమి వివరాలు సేకరిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ భూములు ఎన్ని ఉన్నాయి.. కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయి. సాగులో లేని దేవాలయ భూములు, వక్ఫ్‌ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అనే వివరాలు మూడు రోజుల్లో ఇవ్వాలని వ్యవసాయాధికారులకు సూచించింది.

ఏటా రూ.15 వేలు..
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఏటా రూ.10 వేల చొప్పున చెల్లించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈమేరకు అర్హులను ఎంపిక చేస్తోంది. ఇదే సమయంలో కౌలు రైతులకు కూడా ఏడాదికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని తెలిపింది. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఈ స్కీం ఇంకా అమలు కాలేదు. ప్రస్తుత సీజన్‌లో రైతు భరోసా కింద రైతులకు మాత్రమే సాయం అందించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అనర్హులను తొలగించి రైతు భరోసా సాయం అందించేందుకు కసరత్తు చేస్తోంది.

కొత్త మార్గదర్శకాలు ఇవీ..
రైతు భరోసా కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, ప్రజాప్రతినిధులు, బడా వ్యాపార వేత్తలకు పెట్టుబడి సాయం అందదు. బీడుభూములు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు ఈ పథకం వర్తించదు. దీంతో ప్రభుత్వానికి భారీగా నిధులు మిగులాయని సీఎం భావిస్తున్నారు. ఇక రైతుభరోసాను 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి మాత్రమే వర్తింపజేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని బీఆర్‌ఎస్‌ తప్పు పడుతోంది. కానీ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ప్రకారం.. రైతు భరోసా 10 ఎకరాలలోపు వారికే ఇవ్వాలని చాలా మంది రైతులు సూచించారు. ఈ నేపథ్యంలో అధికారికంగా మార్గదర్శకాలను వారం పది రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉంది.