Group-2 Schedule : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పదేళ్లయింది. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్య పరిష్కారమైంది. ఇక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పులపాలైంది. ఇక తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందన్న నేతే పదేళ్లు రాష్ట్రాన్ని పాలించినా ఉద్యోగ నియామకాల విషయంలో తీవ్ర జాప్యం చేశారు. దీంతో పదేళ్లుగా నిరుద్యోగుల్లో అసహనం పెరిగిపోయింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యువతలోని అసహనాన్ని గమనించిన గత సీఎం కేసీఆర్ ఎట్టకేలకు గ్రూప్–1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించడంలో నాటి టీఎస్‌పీఎస్సీ విఫలమైంది. ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. దీంతో పరీక్ష వాయిదా పడింది. తర్వాత పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యం వహించింది. దీంతో కోర్టు మరోసారి పరీక్ష రద్దు చేసింది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వమే మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర గ్రూప్ 2 పరీక్ష ఏడాదిగా వాయిదా పడుతూనే వచ్చింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసింది. టీసీపీఎస్సీగా పేరు మార్చింది. ఇటీవలే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. గ్రూప్–2 పరీక్ష కూడా ఈనె 7, 8వ తేదీల్లో జరగాల్సి ఉండగా, పోస్టుల సంఖ్య పెంచాలంటూ నిరుద్యోగులు పోరుబాట పట్టారు. డీఎస్సీ ముగిసిన రెండు రోజులకే గ్రూప్–2 పరీక్ష ఉండడంపైనా అభ్యర్థుల అభ్యంతరం తెలుపడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
చివరి క్షణంలో వాయిదా..
షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించడానికి టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాలను గతంలోనే గుర్తించగా, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గ్రూప్ 2 పోస్టులను 2 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు. మొత్తం 18 విభాగాల్లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గత ఏడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు వివిధ కారణాలతో గ్రూప్ 2 వాయిదా పడింది.
డిసెంబర్‌లో పరీక్షలు..
తాజాగా గ్రూప్–2 పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్వహించింది. ఈమేరకు షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించించింది. ఉదయం, మధ్యాహ్నం రెండు షెడ్యూళ్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మరో నాలుగు నెలల సమయం ఉన్నందున భ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.