Korameenu Fish: తెలంగాణలో మత్స్య, మాసం ఉత్పత్తులె పెంచాలని, మత్స్యకారులతోపాటు కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారి ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చాలని బీఆర్‌ఎస్ సర్కార్ అనేక పథకాలు ప్రవేశపెట్టింది. మత్స్య సంపద పెంచడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేయడం మొదలు పెట్టింది. దీంతో గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో మత్స్య సంపద బాగా పెరిగింది. ఇక కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా ఉచిత చేప పిల్లల పంపిణీ విషయంలో ఆచితూచి వ్యవహరించింది. చేపల కోటాను సగానికి తగ్గించింది. అయినా చెరువుల, కుంటలు, జలాశయాల్లో విడుదల చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర చేప అయిన కొరమీను(బొమ్మె) చాపల పెంపకం, రక్షణ, అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహాకారం తీసుకోనుంది.
ఎల్లంపల్లి వద్ద యూనిట్..
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుకు.. అప్పటికే నిర్మించిన మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం గుండెకాయలాంటింది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటిని వివిధ ఫ్రాంతాలకు తరలిస్తున్నారు. సెంటర్ పాయింట్ అయిన ఎల్లంపల్లి వద్ద మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.15 కోట్లతో ఇక్కడ కొరమీను సంరక్షణ, పెంపకం కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ.15 కోట్లు అవసరమని అంచనా వేసి నిధులు కూడా కేటాయించింది. నీటిపారుదల శాఖ అధికారులు ఎల్లంపల్లి వద్ద 85 ఎకరాల స్థలాన్ని మత్స్యశాఖకు అప్పగించింది. ఈమేరకు బదిలీ ప్రక్రియ పూర్తయింది.
రూ.15 కోట్లతో..
కొరమీను పెంపకం, సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే తోలిసారి జాతీయ వ్యవసాయ పరివోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతికత సహకారంతో దీనిని స్థాపించనున్నారు.
శదాబ్దాల చరిత్ర..
ఇక కొరమీనుకు తెలంగాణలో శతాబ్దాల చరిత్ర ఉంది. పోషకాల గనిగా దీనికి పేరుంది. 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించింది. దీని జాతిని కాపాడడానికి వాటి సంఖ్య పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇక మత్స్యశాఖ కొరమీను జన్యువును ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్‌లో భద్రపరిచింది. దీనికి ఓవైపు డిమాండ్ పెరుగుతుండగా, మరోవైపు పెంపకం తగుతోంది. ఇంకోవైపు హైబ్రిడ్, క్యాట్‌ఫిష్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొరమీను ప్రాశస్త్యం చాటేలా వాటి పెంపకాన్ని, సంరక్షణ, వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే కేంద్రం కార్యరూపం దాల్చనుంది.
30 ఎకరాల విస్తీర్ణంలో..
కొరమీను సంరక్షణ, పెంపకం కేంద్రాన్ని 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనన్నారు. ఇందులో కొరమీనుతోపాటు ఆ జాతికే చెందిన బురద మట్టలు, పూల మట్టల రకాల చేపల విత్తన కేంద్రం, పెంపకానికి హేచరీలు ఏర్పాటు చేస్తారు. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణ కేంద్రం ఉంటుంది. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ పెంచిన చేపలు, చేప పిల్లలు రాష్ట్ర అవసరాలకు పోను మిగిలితే ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తారు. మరోవైపు వాటిపై విస్తృతంగా పరిశోదనలు చేస్తారు.