Google Safety Engineering Center : ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఐటి శాఖ మంత్రిగా కేటీఆర్ పని చేశారు. పురపాలక, పరిశ్రమల శాఖలను ఆయన పర్యవేక్షించారు. నాడు తాను మంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్లల్లో పెట్టుబడులు వచ్చాయని.. తెలంగాణ సుభిక్షంగా ఉందని.. వేలాది ఉద్యోగాలు లభించాయని.. రాష్ట్ర ప్రభుత్వానికి దండిగా ఆదాయం సమకూరిందని పదేపదే కేటీఆర్ చెబుతున్నారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా గణాంకాలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ పాలసీ విషయంలో భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ వద్ద ఆయుధం అనేది లేకుండా పోయింది. దీంతో ఐటీ విభాగంలోలో కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోతుందనే విషయం ప్రజల్లోకి భారత రాష్ట్ర సమితి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. అయితే దీనికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు సరికొత్త ప్లాన్ రూపొందించారు. ఇకపై భారత రాష్ట్ర సమితి నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ తనపై విమర్శలు చేయకుండా పకడ్బందీ అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. దీనికి గూగుల్ సహాయం కూడా తీసుకున్నారు.
ఆసియా పసిఫిక్ రీజియన్ లో మొట్టమొదటిసారి..
అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ గూగుల్ సంస్థకు హైదరాబాద్ లోనే ఉంది. దీనిద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. రకరకాల ఆపరేషన్లు ఇక్కడి నుంచే చేపడుతోంది. అయితే ఇప్పుడు ఆ సంస్థ హైదరాబాదులో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. గత ఆగస్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గూగుల్ కంపెనీ తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో హైదరాబాదులో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి గూగుల్ సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం గూగుల్ సంస్థకు టోక్యోలోనే అతిపెద్ద సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఉంది.. ఇప్పుడు ఆ నగరం తర్వాత ఆసియా పసిఫిక్ రీజియన్ లో హైదరాబాదులోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ దేశంలోనే అత్యంత అధునాతనమైన సెక్యూరిటీ, ఆన్ లైన్ ఉత్పత్తుల భద్రత విషయంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు సైబర్ సెక్యూరిటీ పరిశోధనలకు వేదికగా నిలుస్తుంది. దీని ద్వారా వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయి. గూగుల్ సంస్థ ప్రపంచంలోనే మేటి నగరాలను కాదని హైదరాబాదును ఎంచుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులపాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐటీ పాలసీ మీద అవగాహన లేదని విమర్శలు చేసిన కేటీఆర్.. ఇకపై సైలెంట్ గా ఉండాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. గత పది ఏళ్లల్లో ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయో తెలియదు కానీ.. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి ఐటీ నేనే పరిచయం చేశాను అన్నట్టుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉండేదని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు అతిపెద్ద బహుళ జాతి సంస్థలు వస్తున్నాయని.. ఇప్పుడు భారత రాష్ట్రపతి నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.