Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహిళలకు, రైతులకు సంబంధించి వివిధ పథకాలు ప్రవేశపెట్టి వారి నుంచి మెప్పు పొందుతోంది. తాజాగా పేద విద్యార్థుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులతో ఆయన సమావేశం అయి దీని గురించి చర్చించారు. ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేయనున్నారు. ముందుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ప్రారంభించే దీని వివరాల్లోకి వెళితే..
ఎన్నికల కోడ్ ముగిసినప్పటి నుంచి తెలంగాణలో ప్రభుత్వ కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి సంక్షేమ పథకాలు అందిస్తుండగా.. కొత్తగా దరఖాస్తు చేరసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. వీటిలో జీరో విద్యుత్ బిల్లు, గ్యాస్ సబ్సిడీ వంటివి ఉన్నాయి. లేటేస్టుగా రైతులకు రుణమాఫీకి సంబంధించి కసరత్తు పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి రైతుల రుణమాఫీ చేయనున్నారు.
తాజాగా విద్యార్థుల చదువుపై రేవంత్ రెడ్డి టీం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో సమీకృత రెసిడెన్సీ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఆయా ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ, బీసీ గురుకులాలు ఉన్నాయి. కానీ ఇప్పడు ఇవన్నీ ఒకే చోట ఉండనున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా భవనాలు కూడా నిర్మించనున్నారు. ఈ భవనాలన్నీ ఒకే మోడల్ లో ఉండే విధంగా చూడనున్నారు.
ఈ సమీకృత రెసిడెన్సీ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. అందుకు అవసరమైన బోధనా సిబ్బంది, విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ముందుగా వీటికి సంబంధించి ఫైలట్ ప్రాజెక్టును కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. వీటిలో కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కాగా.. మధిర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కది. ఈరెండు కీలక నియోజకవర్గాలు అయినందున ఈ ప్రాజెక్టుకు సక్సెస్ చేసి ఆ తరువాత అన్ని నియోజకర్గాల్లో చేపట్టే అవకాశం ఉంది.