
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ డ్రైవింగ్ కేంద్రంలో శిక్షణను పొందిన వాళ్లు పరీక్షకు వెళ్లకుండానేలైసెన్స్ ను పొందే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది. రవాణాశాఖ అధికారులు రాజధాని పరిధిలో ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ ను పొందాలని భావిస్తే మొదట ప్రైవేటుగా శిక్షణ తీసుకుని ఎల్.ఎల్.ఆర్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అక్కడ ఉత్తీర్ణత పొందిన తర్వాత డ్రైవింగ్ ట్రాక్ కు వెళ్లి వాహనం సమర్థవంతంగా నడిపి శాశ్వత లైసెన్స్ ను పొందాల్సి ఉంది. అయితే కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వాహనదారులకు మేలు చేసేలా ప్రైవేట్ డ్రైవింగ్ పాఠశాలలకు కీలక బాధ్యతలను అప్పగించనుంది.
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తును ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ కేంద్రాల ఏర్పాటు కోసం వెంటనే చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగారానికి చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. అయితే కొత్త వ్యవస్థ అమలు వల్ల 30 రోజులు కచ్చితంగా డ్రైవింగ్ లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ విధానం ద్వారా డ్రైవింగ్ విషయంలో మెలుకువలను కూడా నేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొత్త వ్యవస్థ వల్ల సరిగ్గా లేని వాహనాలు రోడ్లపై వచ్చే అవకాశాలు సైతం తగ్గుతాయని చెప్పవచ్చు. కొత్త విధానంలో కార్లు, ద్విచక్ర వాహనాలకు శిక్షణ ఇచ్చే శిక్షణ కేంద్రం స్థాపించాలంటే ఎకరం స్థలం సొంతంగా ఉండాలి. కార్లు, ఇతర వాహనాలను నడిపే కేంద్రాలకు కనీసం రెండు ఎకరాల స్థలం కచ్చితంగా ఉండాలి.