Godavari Project Dispute: రాజకీయ నాయకులు అప్పుడప్పుడు సోయి తప్పి మాట్లాడుతుంటారు. విలేకరులు ఎదురుగా ఉన్న విషయాన్ని మర్చిపోయి.. మీడియాలో ప్రసారమవుతుందనే విషయాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. దీంతో మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. ఇప్పుడు ఇక సోషల్ మీడియా రోజులు కాబట్టి ఎంత ప్రచారం జరగాలో అంత ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఇలాంటివి రాజకీయ నాయకులకు మంచి చేయవు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక గాలి వ్యవహారం. గాలి బాపతు గాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇక వారు చేసే కామెంట్లు.. సృష్టించే మీమ్స్ మామూలుగా ఉండవు. అందుకే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి..ఎరుక తో వ్యవహరించాలి.
తెలంగాణలో ఇటీవల రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షం అని సంబంధం లేకుండా మీడియా ఎదురుగా కనబడితే చాలు శివాలూగి పోతున్నారు. ఏం మాట్లాడుతున్నారో వారికి సోయి ఉండడం లేదు. ఈ మధ్య ఒక పరిధి దాటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అవికాస్తా మీడియాలో పడి మంటలు రేపుతున్నాయి.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉన్నాయి. మీడియా ఎదుట ఆ మంత్రి ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది.
Also Read: హరీష్ రావు, కేటీఆర్ పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదారి నది మీద నిర్మించే ఓ ఎత్తిపోతల పథకానికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇవ్వలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇది తమ విజయమని ప్రకటించింది. ఇందులో భాగంగానే మంత్రులు.. ఇతర కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు. తాము చేసిన పోరాటం వల్లే కేంద్రంలో ఏపీ ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులు ఉన్నప్పటికీ.. గోదావరి నది మీద నిర్మించే ఎత్తిపోతల పథకానికి అనుమతులు లభించలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.. అంతేకాదు విలేకరుల సమావేశంలో గులాబీ పార్టీ నాయకులను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. నాడు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి ఏపీకి జై కొట్టారని అంటున్నారు.
కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే విషయంపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. సహజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచులు వేస్తుంటారు. ఓపెన్ గా మాట్లాడుతుంటారు. గోదావరి నది మీద నిర్మించే ఎత్తిపోతల పథకానికి సంబంధించి హరీష్ రావు, కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని.. ప్రతిపక్ష నాయకుడిగా కెసిఆర్ అడిగితే తాను సమాధానం చెబుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Also Read: లైవ్ లోనే కొట్టుకున్నారు.. నేతల వీడియో వైరల్
తనది కేసీఆర్ స్థాయిని.. హరీష్ రావు, కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టారు. ” హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడు కాదు. కేటీఆర్ కూడా అంతే. కేటీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలు మాత్రమే. కేటీఆర్ వాళ్ళ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు కావచ్చు. ఆయన నాయకత్వాన్ని సోదరి కల్వకుంట్ల కవితనే ఒప్పుకోవడం లేదు. పైగా ఆమె తన పార్టీలో కేసీఆర్ ను మాత్రమే నాయకుడిగా చూస్తాను అన్నది. నేను కూడా అదే బాటలో ఉన్నానని” వెంకటరెడ్డి స్పష్టం చేశారు.. అయితే దీనిని గులాబీ అనుకూల సోషల్ మీడియా విభాగం వారు కేసీఆర్ కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.