GMR Shamshabad Airport: ఆర్థిక స్థిరత్వం అంతగా లభించని రోజుల్లో విమానయానం అనేది శ్రీమంతులకు మాత్రమే అందుబాటులోకి ఉండేది. పైగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో బేగంపేట విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు, దేశీయ విమానాలు రాకపోకలు సాగించేవి. శంషాబాద్ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన తర్వాత.. ఐటీ సంస్థలు, ఫార్మా సంస్థలు తామర తంపర గా ఏర్పాటయిన తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది. పైగా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, ఇతర దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఉద్యోగాలు, చదువు, విహారయాత్ర.. కారణాలు ఏవైనా విదేశీ యానం చేసే వారి సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఫలితంగా హైదరాబాద్ విమానాశ్రయంలో అధిక అభివృద్ధి నమోదయింది.
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయం జిఎంఆర్ గ్రూపు నిర్వహణలో ఉంది. గత నెలలో ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి నమోదైన అభివృద్ధిని జిఎంఆర్ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గత నెలలో 22.65 లక్షల మంది రాకపోకలు సాగించారు. కథ ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు దాదాపు 13 శాతం అధికంగా వృద్ధి నమోదయింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి కూడా 8 శాతం అధికంగా 63.83 లక్షల మంది ప్రయాణాలు కొనసాగించారు. ఇక గోవాలో కొత్తగా నిర్మించిన మోపా విమానాశ్రయం నుంచి రాకపోకలు సాధించే ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది.. ఈ విమానాశ్రయం నుంచి 3.34 లక్షల మంది అధికంగా ప్రయాణించారు. ఇవే కాకుండా జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఇండోనేషియా మేడాన్, ఫిలిప్పీన్స్ లోని సేపు విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఈ అన్ని విమానాశ్రయాల నుంచి గత నెలలో 1.6 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో 4.25 కోట్ల మంది ప్రయాణికులు జిఎంఆర్ ఆధ్వర్యంలోని విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించారు.
గతంలో ప్రయాణికులు దేశీయ ప్రాంతాలకు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు వారిలో పూర్తిగా మార్పు వచ్చింది. చాలామంది అంతర్జాతీయ ప్రాంతాలకే వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. గత నెలలో అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య క్రితం ఏడాది నెలతో పోల్చినప్పుడు 9.3% పెరిగింది. అంతేకాదు దేశీయంగా ప్రయాణికుల సంఖ్యలో 7.1 వృద్ధి నమోదయింది. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఢిల్లీ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ -1 నుంచి కార్యకలాపాలను జీఎంఆర్ గ్రూప్ మొదలుపెట్టింది. ఏసీఐ నిర్వహిస్తున్న ఎయిర్పోర్టు కార్బన్ అక్రిడిషన్ ప్రోగ్రాం లో భాగంగా ఢిల్లీ విమానాశ్రయం నెట్ జీరో కార్బన్ మిషన్ ఎయిర్పోర్ట్ హోదాను సంపాదించింది. ఈ హోదా పొందిన తొలి విమానాశ్రయం ఢిల్లీ కావడం విశేషం. ఇక ఇది మాత్రమే కాకుండా జిఎంఆర్ ఆధ్వర్యంలో ఉన్న విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు గతం కంటే పెరిగాయి. హైదరాబాద్ కు గత నెలలో 15,707, ఢిల్లీకి 37 ,757, గోవా విమానాశ్రయానికి 2,549 విమానాలు రాకపోకలు సాగించాయి. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ కు వచ్చిన విమానాల సంఖ్య ఏకంగా 13 % పెరిగింది. ఢిల్లీకి ఆరు శాతం, గోవా విమానాశ్రయానికి 31 శాతం అధికంగా విమానాలు రాకపోకలు సాగించాయి.