Voter Details: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు ఎక్కువ మంది పోలింగ్‌లో పాల్గొనేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కూడా ఈసారి ఓటుహక్కు కల్పించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 15 వరకు నమోదుకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో కొన్ని కారణాల వల్ల ఓటరు జాబితా నుంచి కొన్ని పేర్లను తొలగిస్తున్నట్లు ఈసీకి ఫిర్యాదులు అందుతున్నాయి.
తొలగింపునకు వివిధ కారణాలు..
పేర్ల తొలగింపునకు అనేక కారణాలు ఉంటాయి. సరైన ఆధారాలు లేకపోవడం, తప్పుడు వివరాలతో నమోదు చేయడం ప్రధాన కారణాలు. అలాంటి పరిస్థితిలో ఎన్నికల తేదీకి ముందు తమ ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఓటువేసే హక్కును కోల్పోతారు.
ఇలా తెలుసుకోండి..
ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో చిటికెలో కనుక్కోవచ్చు. ఎక్కడున్నా ఓటరు జాబితాను కచ్చితంగా చెక్ చేయవచ్చు. ఓటరు జాబితాలో అర్హులు వారి పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఈ సూచనలు పాటిస్తే జాబితాలో పేరు తనిఖీ చేసుకుని తెలుసుకోవచ్చు. తనిఖీ చేసే ముందు ఓటరు ఈ కింది సలహాలు పాటిస్తే చాలు. ఓటరు జాబితాలో పేరును తనిఖీ చేసే ముందు, మీరు ఓటరు ఐడీ కార్డుపై ఎపిక్ నంబర్ (ఎలక్టర్స్ ఫోటో గుర్తింపు కార్డు) ఉండాలి. అలాగే ఓటరు జాబితాలో మీ పేరును తనిఖీ చేయడానికి పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, జిల్లాతో పాటు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి.
చెక్ చేసుకునే విధానం..
ముందుగా మీరు గూగుల్ ఓటర్ల సేవా పోర్టల్‌ను సర్చ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ సర్చ్ లో electoralsarch.eci.gov.in లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో, ఓటరు జాబితాలో మీ పేరును చెక్ చేయడానికి మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. మొదటి ఆప్షన్ ఏమిటంటే, మీరు వివరాలను నమోదు చేయడం ద్వారా ఓటరు జాబితాలో పేరును చెక్ చేయవచ్చు. రెండవ పద్ధతి ఎపిక్ ద్వారా సెర్చ్ చేసి వివరాలు పొందవచ్చు. మూడో పద్ధతి మొబైల్ ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఓటరు హెల్ప్‌లైన్ అనే యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు లేదా బీఎల్‌వో, తహసీల్దార్ కార్యాలయంలో ఫాం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.