Hyderabad Real estate : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూసీ ప్రక్షాళనతోపాటు, నగరంలో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను చెర విడిపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం హైడ్రా ఏర్పాటు చేసింది. జూలైలో ఏర్పాటైన హైడ్రా చెరువులు, కుంటల ఆక్రమణలను తొలగిస్తోంది. కట్టడాలను కూల్చివేస్తోంది. ఇప్పటికే 100 ఎకరాలకుపైగా ఆక్రమిత భూమికి విముక్తి కల్పించింది. వందలాది నిర్మాణాలను నేలమట్టం చేసింది. హైడ్రా చర్యలను సామాన్యులు స్వాగతిస్తున్నారు. కానీ, ఆక్రమణదారులకు మింగుడు పడడం లేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇదిలా ఉంటే.. హైడ్రా కారణంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు హైడ్రా ప్రభావం రియల్ వ్యాపారంపై లేదని పేర్కొంటున్నాయి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాల్లో రియల్ వ్యాపారంలో డౌన్ ట్రెండ్ నడుస్తోందని పేర్కొంటున్నాయి. దీనిని తప్పుదోవ పట్టించేలా ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారు.
నిపుణుల మాట ఇదీ..
ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, ఐటీరంగంలో ఒడిదుడుకులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారలు నేల విడిచి సాము చేయడం వంటి కారణాలతో దేశ వ్యాప్తంగా రియల్ వ్యాపారం డౌన్ అయిందని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే జూన్‌లో రిజిస్ట్రేషన్లు బాగానే జరిగాయి. ఇళ్ల రిజిస్ట్రేషన్లలో వృద్ధి కనిపిస్తోంది. కానీ, స్థలల కొనుగోలు విషయంలో కాస్త తగ్గుదల కనిపిస్తోందని నెట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది. జూలైలో అమ్మకాలు మరింత తగ్గాయని తెలిపింది. అయితే తగ్గుతల హైదరాబాద్‌లో మాత్రమే కాదని దేశ వ్యాప్తంగా తగ్గాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో తగ్గుతల కాస్త ఎక్కువగా ఉందని చెబుతున్నాయి. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల సంఖ్యను అధికారికంగా ప్రకటిస్తే.. వాస్తవం తెలుస్తుంది.
రియల్టర్ల తీరుతోనే..
దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం డౌన్ ట్రెండ్‌కు రియల్టర్లే కారణం అంటున్నారు నిపుణులు. హైదరాబాద్‌లో రియల్టర్లు అయితే.. ఇష్టానుసారం ధరలు పెంచడం, సామాన్యులు, మధ్య తరగతికి అందుబాటులో లేని ధరలు చెపపడం కారణంగా కూడా వ్యాపారం తగ్గుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. సామాన్యులుకు అవసరమైన ఇళ్లు కాకుండా.. లగ్జరీ ఇళ్ల పేరుతో కనీస ధర రూ.కోటి నుంచి ప్రారంభం అవుతుండడం కూడా వ్యాపారం తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. ప్రజల అభిరుచి, సామాన్యుల ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణాలు చేస్తే మార్కెట్ పుంజుకుంటుంది. కానీ, కేవలం సంపన్నులు దృష్టిలో పెట్టుకుని చేసే నిర్మాణాతో మార్కెట్‌లో డౌన్ ట్రెండ్ కనిపిస్తోందని పేర్కొంటున్నారు. పెద్దగా సౌకర్యాలు లేని అపార్ట్‌మెంట్ల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేవు. ఈ కారణంగా సొంత ఇల్లు కొనాలనుకునేవారు హైదబాద్ నుంచి ఇతర జిల్లాలవైపు చూస్తున్నారని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
రూ.50 లక్షలలోపు ఇళ్లకే డిమాండ్..
మధ్యతరగతి జీవలు ప్రపంచం హైదరాబాద్. ఇక్కడ సొంత ఇల్లు ఉండాలని చాలా మంది భావిస్తారు. అయితే 80 శాతం మధ్య తరగతి ప్రజల బడ్జెట్ రూ.50 లక్షల లోపే. కానీ రియల్టర్లు ఈవిషయం మర్చిపోయి కోటి రూపాయలకు పైగా ఇంటి ధరలు చెబుతున్నారు. దీనికి లగ్జరీ అనే పదం జోడిస్తున్నారు. ఈ కారణంగానే ఇళ్ల కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపడం లేదు. దీంతో డిమాండ్ పడిపోయి. వ్యాపారం తగ్గుతోంది. చాలా మంది ధరలు తగ్గుతాయన్న ఆలోచనతో వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
భారత్‌లో పెట్టుబడికి..
వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసే భారతీయులు అక్కడ సంపాదించిన డబ్బును భారత్‌లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడైతేనే సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. చాలా మంది రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఇప్పుడు ఐటీలో ఒడిదుడుకుల కారణంగా పెట్టుబడులు కూడా తగ్గాయి. ఈ కారణంగా రియల్ వ్యాపారం తగ్గింది. మొత్తంగా హైదరాబాద్‌లో ఇప్పుడు ధరల సర్దుబాటు పరిస్థితి కనిపిస్తోంది. రియల్టర్లు ధరలపై పునరాలోచన చేసి.. మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేస్తే వ్యాపారం మళ్లీ పుంజుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రతీ ఐదారేళ్ల తర్వాత రియల్ వ్యాపారంలో ఇలాంటి సర్దుబాటు సహజమే అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.