Etala Rajendar : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హైడ్రా సాగిస్తున్న దూకుడు మామూలుగా లేదు. హైదరాబాద్ నగరంలో ఆక్రమణకు గురైన చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనికి సీనియర్ ఐపీఎస్ రంగనాథ్ బాస్ గా కొనసాగుతున్నారు. ఇప్పటికే చెరువులలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను పడగొడుతున్నారు. ఈ కూల్చివేతల పై ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతోంది. భారత రాష్ట్ర సమితి మినహా మిగతా పార్టీల నుంచి కూడా దాదాపుగా ఇదే స్థాయి స్పందన వస్తోంది. అయితే హైడ్రా గురించి కొంతమంది మేధావులు కూడా సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ జాబితాలో ప్రముఖ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా తన స్పందనను తెలియజేశారు. హైడ్రా వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించిన ఆయన.. ఆరంభ శూరత్వం లాగా కాకుండా.. దీనిని మరింత ముమ్మరంగా చేయాలని కోరారు. నీటి వనరులను సంరక్షించుకోకుంటే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో ఆక్రమణకు గురైన చెరువులను, కుంటలను, నాలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న ప్రయత్నాన్ని సమర్ధించారు.
రాజేందర్ ఏమన్నారంటే..
రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ మరో విధంగా మాట్లాడారు. హైడ్రా పేదల జోలికి రావద్దని హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేదల గురించి తెలియని కొంతమంది సుడోమేధావులు రేవంత్ రెడ్డిని కీర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ జాబితాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఉన్నారని.. ఆయన కంటికి రేవంత్ రెడ్డి అభివృద్ధి కామకుడి లాగా కనిపిస్తున్నారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడంతో సహజంగానే అది చర్చకు దారి తీసింది.
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇచ్చిన కౌంటర్ ఇదీ
ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తన యూట్యూబ్ ఛానల్ లో ఈటల రాజేందర్ ను కడిగిపారేశారు..”అస్మత్ పేట, అల్వాల్ చెరువు లోని పేదల గురించి నాకు తెలియదని ఈటల రాజేందర్ అన్నారు. నేను క్షేత్రస్థాయిలో తిరిగే రాజకీయ నాయకుడిని కాదు. నేను మండలి సభ్యత్వానికి దూరమై కూడా తొమ్మిది సంవత్సరాలు కావస్తోంది. ఒకవేళ పేదల తరఫున పోరాటం చేద్దాం అంటే నేను కూడా రాజేందర్ తో కలిసి పాల్గొంటాను. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితుడైన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈటల రాజేందర్ భావించలేదా? రేవంత్ రెడ్డితో చర్చలు జరపలేదా? ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడుగా ఉన్న ఈటల రాజేందర్.. ఆ పార్టీలో ఉంటారని చెప్పగలరా.. రేపటి నాడు కాంగ్రెస్ పార్టీలో చేరబోరని హామీ ఇవ్వగలరా? హైదరాబాద్ భారతీయ జనతా పార్టీలోని నాయకులకు భిన్నమైన వైఖరులు ఉన్నాయి. హైడ్రాను బిజెపి ఎంపీ రఘునందన్ రావు, రాజాసింగ్ సమర్థించారు. ఆ విషయం ఈటల రాజేందర్ కు తెలియదా? గత ప్రభుత్వాలు అని చెబుతున్న ఈటల రాజేందర్.. నాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అందులో సభ్యుడు కదా. అయ్యప్ప సొసైటీ, ఎన్ కన్వెన్షన్ సెంటర్, ఇతర నిర్మాణాలను పడగొట్టేందుకు నాడు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగం వెళ్లలేదా? ఆ తర్వాత అవన్నీ ఎందుకు వెనక్కి వచ్చాయి? తెలంగాణ ఉద్యమ సమయంలో లాంకో హిల్స్, పద్మాలయ స్టూడియోస్, ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయలేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. దీనికి ఈటెల రాజేందర్ సమాధానం చెప్పగలరా? ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు కొన్ని విలువలు పాటించాలి.. నేను రేవంత్ రెడ్డి అభివృద్ధి కామకుడు అని అన్నట్టు ఉన్న వీడియోను చూపిస్తే నేను ఇకనుంచి యూట్యూబ్లో విశ్లేషణలు చేయను.. అలా నిరూపించకపోతే రాజేందర్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తారా” అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్ విసిరారు.
సోషల్ మీడియాలో తెగ వైరల్
ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈటల రాజేందర్ కు కౌంటర్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వాస్తవానికి హైడ్రా పని తీరును మాత్రమే నాగేశ్వర్ మెచ్చుకున్నారు. కానీ ఈటల రాజేందర్ ఆ విషయాన్ని పక్కన పెట్టి.. నాగేశ్వర్ పై లేనిపోని ఆరోపణలు చేశారు. దీంతో ఈ విషయం కాస్త ఒకసారి గా వివాదాస్పదమైంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సరైన ఆధారాలతో కౌంటర్ ఇవ్వడంతో ఈటెల రాజేందర్ కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.. ఈటెల రాజేందర్ అనవసరంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పై వ్యాఖ్యలు చేశారని.. ఆయనను గెలుక్కోకుండా ఉంటే బాగుండేదని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
https://mail
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Etala rajender got angry over professor nageshwars comments about revanth reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com