Elevated Corridor Hyderabad: హైదరాబాద్ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువే అవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులు ఒకచోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మెట్రోలాంటి రవాణా సదుపాయాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా పాత హైదరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా ఉన్నాయి. ప్యారడైజ్ కూడలి నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు దూరం తక్కువే అయినప్పటికీ కంటోన్మెంట్ ఇరుకుదారుల మీదుగా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు నరకం.
ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ఇటీవల 4.650 కిలోమీటర్ల పొడువునా డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను ప్రభుత్వం నిర్మించనుంది. ఇది పూర్తయితే దేశంలోనే అతిపెద్ద డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణంతో తెలంగాణ రికార్డు సృష్టిస్తుంది. మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ మనదేశంలో మహారాష్ట్రలోని నాగ్ పూర్ ప్రాంతంలో నిర్మించారు. నాగ్ పూర్ లోని వార్త రోడ్డులో 3.14 కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. మొదటి అంతస్తులో రహదారి, ఆ తర్వాత అంతస్తులో మెట్రో నిర్మించారు.. ఇందులో మూడు స్టేషన్లు ఉన్నాయి. అప్పట్లోనే ఇది గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది.
డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ ను ఉమ్మడి రాష్ట్రంలోనే నిర్మించాలని ప్రతిపాదించారు. మెట్రో మొదటి దశలో పారడైజ్ నుంచి ప్యాట్ని సెంటర్ వరకు ఉన్న ఫ్లైఓవర్లను మొత్తం తొలగిస్తారు. వాస్తవానికి ఈ మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది. ఫ్లై ఓవర్ల నిర్మాణంతో మరింత ఇరుకై పోయింది. వీటిని తొలగించి ఆరు వరుసలలో రహదారి, ఆపైన మెట్రో నిర్మించాలని అప్పటి అధికారులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఫ్లై ఓవర్లను కూల్చకుండానే పక్కనుంచి డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని సూచించడంతో అది నిర్మాణానికి నోచుకోలేదు. ఇక మహారాష్ట్రలోని వార్ధా రోడ్డులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చొరవతో నిర్మించారు. ఇక నగరాలలో జాతీయ రహదారులపై ఎక్కడ ఫ్లై ఓవర్లు నిర్మించే ఆలోచన ఉన్నా.. అక్కడ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ ను పరిశీలించాలని అధికారులను ఇటీవల ఆయన ఆదేశించారు. ఇక ప్రస్తుతం ప్యారడైజ్ కారిడార్ పూర్తయిన తర్వాత.. హయత్ నగర్, పటాన్ చెరువు ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే అవకాశం ఉంది.