https://oktelugu.com/

Elephants Attack: బీభత్సకాండ.. తెలంగాణలో ఎక్కడిది ఏనుగుల మంద..

సాధారణంగా ఏనుగులు ఎండాకాలంలో దాహం తీర్చుకోడానికో, నీడ కోసమో జనావాసాలకు వస్తుంటాయి. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలోకి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేది దాహం తీర్చుకోడానికి కాదట.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 7, 2024 / 05:17 PM IST

    Elephants Attack

    Follow us on

    Elephants Attack: అసలే ఇది ఎండాకాలం.. పంటలు చేతికి వచ్చేకాలం. అంతంతమాత్రంగానే గత ఏడాది వర్షాలు కురవడంతో.. యాసంగిలో రైతులు ఒక మోస్తారు కంటే తక్కువగానే పంటలు సాగు చేశారు. ఆ పంటలు ఇప్పుడు చేతికి వచ్చే స్థాయికి చేరుకున్నాయి. మరి కొద్ది రోజుల్లో పంట సాయం ఇంటికి వస్తుందని రైతులు భావిస్తుంటే.. హఠాత్తుగా గజరాజుల మంద ఆ పంటలపై పడింది. మదమెక్కిన ఏనుగులు నోటికి అందింది తిన్నాయి. కాలికి దొరికిన దాన్ని తొక్కాయి. ఫలితంగా రైతుల పంటలు మొత్తం నాశనమయ్యాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పైగా ఆ ఏనుగుల మందలో ఓ ఏనుగు ఓ రైతును తొక్కి చంపేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం సృష్టిస్తోంది.

    సాధారణంగా ఏనుగులు ఎండాకాలంలో దాహం తీర్చుకోడానికో, నీడ కోసమో జనావాసాలకు వస్తుంటాయి. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలోకి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఏనుగులు జనావాసాల్లోకి వచ్చేది దాహం తీర్చుకోడానికి కాదట. నీడ కోసం అంతకంటే కాదట.. తెలంగాణ రాష్ట్రంలోని మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నది ఒడ్డున ఉన్న పొల్లాలో రైతులు సాగు చేస్తున్న పుచ్చకాయ, చెరుకు పంటలను తినేందుకు అవి వచ్చాయట. వాస్తవానికి ఈ ఏనుగులు ప్రాణహిత నదిని దాటడం ఇదే మొదటిసారి కాదు. ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న పుచ్చకాయ, చెరకు పంటలు ఏనుగులకు అత్యంత ఇష్టమని.. సుదూర ప్రాంతం నుంచే వాటి వాసనను ఏనుగులు పసిగడతాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పెంచికల్ పేటలోని కొండపల్లి గ్రామంలో పుచ్చకాయ, బెజ్జూరు పట్టణ శివారులోని రైతులు చెరుకు పంటను సాగు చేస్తున్నారు. ఇక సలగుపల్లిలోని చెరుకు తోటల్లోకి ఏనుగులు ప్రవేశించాయి. అయితే ఆ తోట చిన్నది కావడంతో వదిలేశాయి.

    ఏప్రిల్ 4న ఓ రైతు తన పుచ్చ తోటకు నీరు పెడుతుండగా ఓ ఏనుగు తొక్కి చంపేసింది. ఇక ఆ ఏనుగు గతంలో పలుమార్లు ప్రాణహిత నదిని దాటిందని.. ప్రస్తుతం గడ్చిరోలి మీదుగా చత్తీస్ గడ్ కు వెళ్లిందని ఆసిఫాబాద్ జిల్లా అటవీ అధికారి చెప్తున్నారు. ఏప్రిల్ 3న ఆ ఏనుగు తొలిసారిగా తెలంగాణలోకి ప్రవేశించిందని, మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలకు ఏనుగు తిరిగి వచ్చిందని ఆయన చెబుతున్నారు.. అయినప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు మరికొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. బెజ్జూరు మండలం నాగ పల్లి ప్రాంతంలో రైతుల విస్తారంగా పుచ్చ సాగు చేస్తున్నారు. ప్రాణహిత నది వెంట ఉన్న సిద్ధాపూర్, ఎలకపల్లి గ్రామాల్లో చెరుకు సాగు చేస్తున్నారు.. గత కొన్ని సంవత్సరాల నుంచి బెజ్జూర్ కేంద్రంగా బెల్లం ఉత్పత్తి జరుగుతోంది. అందువల్ల ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా చెరకు సాగు చేస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాలన్నీ దట్టమైన అడవులుగా ఉండేవి. అయితే చాలామంది ఆ వృక్షాలను నరికివేసి ఆ భూములను పంటపొలాలుగా మార్చారు. ఫలితంగా ఏనుగులు గ్రామాల మీద పడుతున్నాయి. పంట చేలను నాశనం చేస్తున్నాయి. పుచ్చ, చెరకును పీల్చి పిప్పి చేస్తున్నాయి. వర్షాకాలంలో అడవులు పచ్చగా ఉంటాయి కాబట్టి.. తినడానికి పండ్లు దొరుకుతాయి కాబట్టి ఏనుగులు బయటకు రావడం లేదు. కానీ ఎండాకాలంలో అవి ఆహారన్వేషణకు బయటికి వస్తున్నాయి. చెరకు, పుచ్చ పంటల వాసనను అవి సుదూర ప్రాంతాల నుంచి పసిగడతాయి కాబట్టి.. ఆ పంటచేల మీద పడుతున్నాయి. అడ్డుగా ఎవరైనా రైతులు వెళ్తే వారిపై దాడులు చేస్తున్నాయి.. అయితే ఇలా ఏనుగులను ఎదుర్కోవడంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన సేజ్ అనే స్వచ్ఛంద సంస్థ అటవీ శాఖ సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ తుది దశలో ఉంది.