విద్యుత్ వినియోగదారుల హక్కులపై కేంద్రం కొత్త ముసాయిదాను విడుదల చేసింది. డిస్కంలను కేంద్రం పరిధిలోకి తీసుకోవడం సరికాదంటూ వచ్చిన విమర్శలను లెక్కలోకి తీసుకోలేదు. ఈ కొత్త ముసాయిదాపై ఏమైనా అభిప్రాయాలు ఉంటే ఈనెల 30 లోగా చెప్పాలని సూచించింది. ఈ ముసాయి ప్రకారం.. విద్యుత్ బిల్లు రూ.వెయ్యి మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్న నిబంధనను తీసుకొస్తోంది.
Also Read: చరిత్ర దాచిన తెలంగాణ ‘సాయుధ పోరాటం’!
విద్యుత్ వినియోగదారుల హక్కులు–2020 పేరుతో రూపొందించిన ముసాయిదాలో ఈ అంశాన్ని పేర్కొంది. బిల్లు వెయ్యి కానీ.. లేదా కమిషన్ నిర్దేశించిన మొత్తాన్ని మించితే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సిందే. ఆన్‌లైన్‌లో పే చేసిన వారికి కమిషన్ నుంచి ప్రోత్సహకాలు, రాయితీలు కూడా లభిస్తాయట. దీనిపై ఈనెల 30లోపు అభిప్రాయాలను చెప్పాలని కోరింది. ఆ లోపు వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా తుది ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.
ముసాయిదాలో మరికొన్ని వివరాలను తెలిపింది. అవి.. 10 కేడబ్ల్యూ లోడ్ వరకు కొత్త కనెక్షన్ తీసుకోవడానికి గుర్తింపు కార్డు (పాస్ పోర్టు, ఆధార్), కనెక్షన్ తీసుకునే స్థలం/భవనానికి సంబంధించిన యాజమాన్య హక్కులు సమర్పిస్తే సరిపోతుంది. కొత్త/పాత కనెక్షన్ మార్చడానికి భౌతికంగా కానీ, ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజులు, మున్సిపాలిటీల్లో 15 రోజులు, మెట్రోనగరాల్లో అయితే వారం రోజుల్లోపు కొత్త కనెక్షన్ ఇవ్వడం లేదంటే మార్చడం చేయాలి.
Also Read: తెలంగాణ ‘విమోచనం’ ఎలా అయ్యింది?
మీటర్ క్వాలిటీ లోపించిడం.. కాలిపోవడం, చోరీకి గురైతే వాటి స్థానంలో టౌన్‌లలో అయితే 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 72 గంటల్లో కొత్త మీటర్లు ఏర్పాటు చేయాలి. మీటరు వినియోగదారుడి ఇంటిబయట అమర్చి ఉంటే దాని రక్షణ బాధ్యత డిస్కంలదే. ఒకవేళ ఇంట్లో బిగించి ఉంటే మంచిచెడులకు వినియోగదారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. టారిఫ్ లెక్కలు డిస్కంల వెబ్‌సైట్‌లో పెట్టాలి. వీటితోపాటు మరికొన్ని విషయాలు ముసాయిదాలో వెల్లడించింది.