Assembly Elections : తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల నిర్వహణకు సమయం రానే వచ్చింది. అక్టోబర్ 9న మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ వెలువరించారు. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఏర్పడనుంది. తెలంగాణతో పాటు రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడానికి అధికార బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ సహా ఇతర పార్టీలు సిద్ధమవుతున్నాయి.
* తెలంగాణ ఎన్నికల షెడ్యూల్
-నోటిఫికేషన్ : నవంబర్ 3
-నామినేషన్లకు ఆఖరు తేది : నవంబరు 10
-నామినేషన్ల పరిశీలన : నవంబరు 13
-ఉపసంహరణకు ఆఖరు తేది : నవంబరు 15
-పోలింగ్ తేదీ : నవంబరు 30
-ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3
తెలంగాణలో మొత్తం 119 స్థానాలున్నాయి. ఇందులో 12 ఎస్టీ, 18 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా. ఇందులో 27,798 వాటిల్లో వెబ్ కాస్టింగ్ ఉంది. ఈ ఎన్నికల కోసం 72 వేల బ్యాలెట్ యూనిట్లు, 57 వేల కంట్రోల్ యూనిట్లు ఉపయోగించనున్నారు. 56 వేల వీవీ ప్యాట్ యంత్రాలను వాడే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,17,17,389 ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది ఉన్నారు. వందేళ్లు దాటిన వారు 7,689 ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షలు ఉన్నారు. మొత్తం దివ్యాంగులు 5.06 లక్షల ఓట్లు ఉన్నారు.
ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని 119తో పాటు రాజస్థాన్ లో 200 స్థానాలకు, మధ్యప్రదేశ్ 23 స్థానాలకు, ఛత్తీస్ గఢ్ 90 స్థానాలకు, మిజోరాం 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్ లో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్ గఢ్ లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక్కడ భద్రతా సమస్య ఉండడం వల్ల ఈసీ నిర్ణయం తీసుకోనుంది.
తెలంగాణ ఎన్నికల సమరంలో మూడోసారి అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకుంది. అటు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.సోనియా, రాహుల్ రాష్ట్రంలో పర్యటించి 6 ఆకర్ష పథకాలు ప్రకటించారు. ఈ ఎన్నికల సమరంలో బీఎస్పీ కూడా పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు.