Khammam: ఈ సృష్టిలో ప్రేమను పెంచి. ప్రేమను పంచే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అది అమ్మ మాత్రమే.. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు. ఆ అమ్మ ద్వారా ఈ విశ్వానికి ప్రేమను పంచే సౌలభ్యాన్ని ఈ పుడమికి ప్రసాదించాడు. అచంచలమైన ప్రేమకు, అనంతమైన త్యాగానికి, అనితర సాధ్యమైన వాత్సల్యానికి, నిలువెత్తు ప్రతీక అమ్మ.. కడుపులో తంతున్నా ఓర్పుగా భరిస్తుంది. నవ మాసాలు మోస్తుంది.. స్తన్యం తో ఊపిరులూదుతుంది. గోరుముద్దులు తినిపిస్తూ.. ఆకాశంలో చందమామను చూపిస్తూ.. లోకం పోకడను నేర్పిస్తుంది. అలాంటి అమ్మ తన బిడ్డలకోసం ఏమైనా చేస్తుంది. ఎంతైనా చేస్తుంది. చివరికి తన ప్రాణాలను కూడా త్యాగం చేస్తుంది. ఇప్పుడు మీరు చదవబోయే అమ్మ కథ చాలా గొప్పది. గుండెలను ద్రవింపజేసేది..
కాలేయం ఇచ్చేసింది
ఆమె పేరు అమల.. ఆమెది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం.. నాలుగు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో ఆమెకు వివాహమైంది. వారి ప్రేమకు గుర్తుగా ఆదిత్య అనే బాలుడు జన్మించాడు. అతడికి మూడు సంవత్సరాలు. ఆదిత్య పుట్టినప్పుడు అమల చాలా సంబరపడిపోయింది. ఆయన భర్త సంతోషపడ్డాడు. వారసుడు వచ్చాడని ఉప్పొంగిపోయాడు. బంధువులతో ఆ విషయం చెప్పుకొని మురిసిపోయాడు. మిఠాయిలు పంచి తన ఆనందాన్ని మరింత పరిపుష్టం చేసుకున్నాడు.. కానీ వారి సంతోషం ఆవిరవడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు చేదు వార్త అమల దంపతులకు చెప్పారు. అప్పటినుంచి అమల దంపతులకు కంటికి కునుకు లేదు.. కడుపుకు తిండి లేదు. పుట్టినప్పటినుంచి ఆదిత్య కు కాలేయ సమస్య ఉంది. దానివల్ల అతడికి ఏది తిన్నా జీర్ణమయ్యేది కాదు. పైగా కడుపులో నొప్పి వచ్చేది. ఇలా ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా నయం కాకపోవడంతో.. చివరికి ఆదిత్య కు కాలేయం మార్చాలని నిర్ణయించుకున్నారు. అయితే అమల కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో.. వారు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లలేక.. ఉస్మానియాకు వెళ్లారు. అక్కడ ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి.. ఆమె కాలేయాన్ని కుమారుడు ఆదిత్య కు మార్పిడి చేశారు.
కుమారుడికి భోజనం తినిపించి..
కాలేయం ఇచ్చిన తర్వాత.. కొద్దిరోజులు ఆదిత్యను తమ అబ్జర్వేషన్ లో ఉంచుకున్నారు ఉస్మానియా వైద్యులు. అతడి శరీరంలో కాలేయం వృద్ధి చెందుతోందనుకున్న తర్వాత.. తల్లి అమల దగ్గరికి పంపించారు. కొడుకును చూసిన తర్వాత ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆస్పత్రి బెడ్ పై పడుకొని తన కుమారుడిని తనివితీరా ముద్దాడింది. ఆ తర్వాత గోరుముద్దలు తినిపించి.. తన సంతోషాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ దృశ్యాలను ఆస్పత్రి వైద్యులు తమ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.. ఈ దృశ్యాలను చూసిన వారంతా గొప్ప పని చేశారంటూ ఉస్మానియా వైద్యులను కొనియాడుతున్నారు. “మాతృత్వం అంటే ఇది. వాత్సల్యం అంటే ఇది. కొన్ని ప్రేమలకు కొలమానాలు అవసరం లేదు. వాటి రూపం వేరే ఉంటుంది. వాటి అంతరంగం మరో విధంగా ఉంటుంది. ఇలాంటి దృశ్యాలను ఆవిష్కరించాలంటే అది వైద్యులకు మాత్రమే సాధ్యమని” సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలో డిశ్చార్జ్
ప్రస్తుతం అమల కోలుకున్నారని.. ఆదిత్య కూడా బాగానే ఉన్నాడని.. త్వరలో వారిద్దరిని డిశ్చార్జ్ చేస్తామని ఉస్మానియా వైద్యులు అంటున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆదిత్యలో కాలేయం సరిగా ఏర్పడలేదని.. ఇప్పుడు అమల కాలేయం ఇచ్చిన తర్వాత.. అతడి శరీరంలో ఆ భాగం వృద్ధి చెందుతోందని.. వైద్యులు చెబుతున్నారు. వారిని డిస్చార్జ్ చేసిన తర్వాత.. మరొక 15 రోజులకు జనరల్ చెకప్ చేస్తామని.. ఇకపై మందులు వాడాల్సిన అవసరం లేదని వారు వివరిస్తున్నారు. ఆదిత్య ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుందని.. కాలేయం తన పని తాను చేసుకుంటూ పోతుందని పేర్కొన్నారు.