District dispute in Telangana: తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. ఒక వివాదం సద్దుమణగగానే మరో వివాదం తెరపైకి తెచ్చి మరీ తిట్టుకుంటున్నారు. ఇక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కనీస మర్యాద కూడా లేకుండా తిట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో వివాదం తెరపైకి తెచ్చారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన జిల్లా విభజనలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది.
జిల్లా విభజనల నేపథ్యం
ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో 10 జిల్లాలను 33కి పెంచారు. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలనను సులభతరం చేస్తుందని అప్పట్లో చెప్పారు. అయితే, ఇది జనాభా, భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధి సూచికల ఆధారంగా శాస్త్రీయంగా జరగలేదని విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విభజనలను ‘స్వార్థ రాజకీయాల కోసం‘ జరిగినవిగా పేర్కొన్నారు. వీటిని సరిచేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇది రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు కొత్త దిశను సూచిస్తోందని పేర్కొన్నారు.
రెచ్చగొడుతున్న కేటీఆర్..
సీఎం ప్రకటన మాజీ మంత్రి కెటీఆర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. కొత్త జిల్లాలు ప్రజలకు పాలనను దగ్గర చేశాయని, వాటిని తొలగించడం అంటే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు. పరోక్షంగా ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈ మాటలు రాజకీయ ఉద్రిక్తతలను పెంచాయి, ప్రతిపక్షాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ప్రభుత్వం చేసిన సంస్కరణలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తున్నారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే, పరిపాలనా ఖర్చులు తగ్గి సేవలు మెరుగవవచ్చు. కానీ రాజకీయ దుమ్ముమొత్తం ప్రజల అభివృద్ధిని ఆలస్యం చేయవచ్చు. కమిటీ సిఫార్సులు శాస్త్రీయంగా ఉంటే, రాష్ట్రానికి లాభదాయకం కావచ్చు. అయితే, ఈ మార్పులు ఎన్నికల రాజకీయాలతో ముడిపడితే సమస్యలు తీవ్రమవుతాయి. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకత మెరుగుపరచాలి.