High Temperatures Monsoon: రోహిణి కార్తె ముగిసింది. మృగశిర కూడా దాదాపు సగం అయిపోయింది. ఈ ప్రకారం చూసుకుంటే వాతావరణం చల్లగా మారాలి. ఆకాశాన్ని నల్లటి మబ్బులు కప్పేయ్యాలి. చినుకు తడికి పంటలు చిగురు తొడగాలి. నాగళ్ళు నేలమీద సందడి చేయాలి. ఊపిరి సలపని పనులతో అన్నదాతలు బిజీ బిజీగా ఉండాలి. ప్రస్తుతం పై దృశ్యాలేవీ కనిపించడం లేదు. వర్షించాల్సి రుతురాగం నిశ్శబ్దంగా మారింది. వానలు దంచి కొట్టాల్సిన సమయంలో ఎండలు మాడు పగలగొడుతున్నాయి. దీనికి వడగాలు కూడా తోడు కావడంతో బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. మృగశిర కార్తెలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో.. బయట అడుగుపెట్టిందుకే భయపడుతున్నారు. ఇంతకీ ఈ ఏడాది వర్షాలు కురుస్తాయా? ఎల్ నీనో ప్రభావం ఎంత మేరకు ఉంటుంది? గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమయానికి కురిసిన వర్షాలు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నాయి?
ఆలస్యమవుతోంది
గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ లేనంత విధంగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. ఇప్పటికే 10 రోజులకు పైగా జాప్యం జరిగింది. నైరుతి ఆగమనానికి మారో వారం పాటు పట్టవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఈ నెల 20 నుంచి 22వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత పది సంవత్సరాలతో పోలిస్తే ఈసారి నైరుతి రుతుపవనాలు 12 రోజులు ఆలస్యం కావడం గమనార్హం. రుతుపవనాలు రాకపోవడంతో వానలు కురవడం లేదు. ఇది అంతిమంగా వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పంటలు వేయడంలో జాప్యం ఏర్పడటం వల్ల అది దిగుబడి మీద పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 8న కేరళ రాష్ట్రాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు తర్వాత క్రమంగా తమిళనాడు తో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విస్తరించాయి. కానీ ఆ తర్వాత మందకొడిగా మారిపోయాయి. రుతుపవనాలు చురుకుగా కదలాలంటే బంగాళాఖాతంపై నెలకొనే వాతావరణ పరిస్థితులు అత్యంత కీలకం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం లేదా ఉపరితల ద్రోణి, అల్పపీడనం వంటివి ఏర్పడితే రుతుపవనాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు బంగాళాఖాతంలో ఏర్పడలేదు. దీనికి తోడు అరేబియా సముద్రంలో ఏర్పడిన బి ఫర్ జాయ్ తుఫాను ప్రభావంతో నైరుతి మరింత మందకొడిగా మారిపోయింది.
నైరుతి రుతుపవనాలు మే చివరివారం నుంచి జూన్ తొలి వారం మధ్య కేరళ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అవి క్రమక్రమంగా దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయి. అల్పపీడనాలు, తుఫాన్లు వంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రుతుపవనాల కదలికలు ఉంటాయి. గత పది సంవత్సరాలలో రుతుపవనాల రాకను పరిశీలిస్తే 2014, 2016, 2019 సంవత్సరాలలో ఆలస్యంగా వచ్చాయి. 2019లో ఆలస్యంగా వచ్చినప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో వేగంగా 10 రోజుల్లోనే దేశంలోని మెజారిటీ రాష్ట్రాలకు విస్తరించాయి. కానీ ఈసారి అటువంటి పరిస్థితి ఏమీ లేదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 8న కేరళ రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు మూడు రోజుల్లోనే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవేశించాయి. 15 నాటికి తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తొలుత అంచనా వేశారు. కానీ రుతుపవనాలు కదలిక మందకొడిగా ఉందని, అవి తెలంగాణలో ప్రవేశించేందుకు మరో వారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. తొలకరి వాన ల కోసం మరింత ఎదురు చూడక తప్పదని వారు అంటున్నారు. ఒకటి రెండు వర్షాలకు విత్తనాలు నాటితే నష్టపోయే ప్రమాదం ఉంటుందని రైతులకు సూచిస్తున్నారు.
ఇక నైరుతి మందగమనం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి ఉక్కపోత కూడా తోడు కావడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా జూన్ రెండవ వారం తర్వాత గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తగ్గిపోతాయి. ఈసారి 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వాతావరణంలో తేమ పెరగడం వల్ల ఉక్కపోత కొనసాగుతోంది. ఈ పరిస్థితి మరో వారం పాటు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Recommended Video: