Chandrababu- KCR: చంద్రబాబును కలిసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నించారా? పరామర్శించాలని కేటీఆర్ భావించారా? ఈ వార్తల్లో నిజం ఎంత? తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ నేత నారాయణ ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో వాస్తవం ఎంత? అన్న చర్చ నడుస్తోంది.సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే 2014, 2018 ఎన్నికల మాదిరిగా పరిస్థితి లేదు.కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది.బిజెపి సైతం విస్తృత ప్రయత్నం చేస్తుంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు ఇస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బిజెపి దూకుడు చూస్తుంటే గణనీయమైన ఓట్లు చీల్చే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అందరి దృష్టి తెలుగుదేశం పార్టీపై పడింది. ఈ ఎన్నికల్లో టిడిపి పోటీ నుంచి తప్పుకుంది. ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదు. పార్టీ క్యాడర్ మాత్రం కాంగ్రెస్కు జై కొడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో కెసిఆర్ లో ఒక రకమైన కలవరపాటు కనిపిస్తోంది.
అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 53 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో తెలంగాణలోని అన్ని పార్టీలు స్పందించాయి. బిజెపి నేతలు ఖండించారు కూడా. అటు కాంగ్రెస్ నాయకులు సైతంఇది అక్రమ అరెస్టు అని ప్రకటనలు చేశారు.టిఆర్ఎస్ నేతలు మాత్రం నాయకత్వంపై ఉన్న భయంతో లేటుగా స్పందించారు. కేటీఆర్ తొలుత వ్యంగ్యంగా స్పందించారు. తరువాత తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. లోకేష్ కు సంఘీభావం తెలిపారు. అన్నింటికీ మించి ఎల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తమకు చంద్రబాబు శత్రువు కాదనిచెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు.ఇవన్నీ టిడిపి ఓట్ల కోసమేనని కామెంట్స్ వినిపించాయి.
ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును కలిసేందుకు కేసిఆర్ తో పాటు కేటీఆర్ ప్రయత్నించారని సిపిఐ నారాయణ ఆరోపిస్తున్నారు. అందుకు చంద్రబాబు సమ్మతించలేదని.. అందుకే వారి భేటీ జరగలేదని బాంబు వేశారు. అయితే అందులో వాస్తవం ఎంత అన్నది చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే జగన్కు సహకారం అందించారు. వైసిపి గెలుపునకు దోహదపడ్డారు. అప్పటినుండి చంద్రబాబుతో మరింత అగాధం ఏర్పడింది. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో టిడిపి క్యాడర్ అవసరమని భావించి కెసిఆర్ ఆ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవినీతి కేసుల్లో బెయిల్ లభించడంతో చంద్రబాబు హైదరాబాదులోనే ఉన్నారు. ఆయనను పరామర్శించడం ద్వారా టిడిపి క్యాడర్ సింపతీని పొందవచ్చని ఆలోచన చేసి ఉండవచ్చు. అయితే అది కార్యరూపం దాల్చకపోవచ్చు. అయితే ఈ విషయం టిడిపి వర్గాలు బయట పెట్టలేదు.. బిఆర్ఎస్ వర్గాలు సైతం మాట్లాడలేదు. మధ్యలో సిపిఐ నారాయణ చెబుతుండడంతో… ఇందులో వాస్తవం ఎంతో చూడాలి.