Congress: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. షెడ్యూల్ రావడంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రస్తుతం ముందంజలో ఉంది. ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే రెండుసార్లు తెలంగాణలో పర్యటించారు. తాజాగా సోమవారం (మార్చి 18న) జగిత్యాల జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల కోసం వెతుకుతోంది.
వంద రోజుల పాలన..
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ప్రకటించింది. వంద రోజుల పాలన పూర్తయినా గ్యారంటీలు అమలు కాలేదు. రైతు రుణమాఫీ కాలేదు. మహిళలకు రూ.2,500 అందడం లేదు, విద్యార్థులకు రుణ కార్డులు జారీ చేయలేదు. విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదు. పింఛన్లు పెంచలేదు. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే సిలిండర్ అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇటీవలే ప్రారంభించారు. కానీ అది లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు అమలు చేయడం సాధ్యం కాదు.
ధరణి టెన్షన్..
ఇక అధికార పార్టీకి ఇప్పుడు ధరణి టెన్షన్ పట్టుకుంది. అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేసి భూమాత పోర్టల్ తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా ధరణి రద్దు చేయలేదు. ఇక పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా ఎలాంటి చొరవ చూపలేదు. దీంతో దీని ప్రభావం వచ్చే పార్లమెంటు ఎన్నికలపై పడుతుందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. బీఆర్‌ఎస్ ఓటమికి కారణాల్లో ధరణి పోర్టల్ కూడా ఒకటి.
ఈనెల 1 నుంచి పరిశీలన..
పెండింగ్‌లో ఉన్న లక్షలాది ధరణి సమస్యల పరిష్కారానికి భూపరిపాలన విభాగం కమిషనర్ ఇటీవలే చర్యలు చేపట్టింది. మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పోర్టల్ ద్వారా దరఖాస్తులు పరిశీలిస్తూ ఆర్డీవో, తహసీల్దార్లకు రెఫర్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పరిష్కారం మాత్రం కాలేదు. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశం లేదు.
పట్టాలు అందక..
తెలంగాణలో ధరణి పోర్టల్ తెచ్చాక అనేక మంది రైతుల వివరాలు నమోదు చేయలేదు. కొందరి వివరాలు తప్పుగా నమోదు చేశారు. దీంతో రైతులు ఏళ్లుగా సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కానీ, గత ప్రభుత్వం పరిష్కరించలేదు. పట్టాలు అందకపోవడంతో పథకాలకు కూడా అర్హత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ధరణి రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ వంద రోజుల పాలనలో నెరవేర్చలేదు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి నచ్చజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రక్రియ కొనసాగుతోందని, కోడ్ ముగియగానే పరిష్కారం అవుతాయని ఓటర్లకు కాంగ్రెస్ చెప్పే అవకాశం ఉంది. దీనిని ఓటర్లు ఏమేరకు నమ్ముతారో చూడాలి.