Delhi Liquor Scam : కేటీఆర్ చెప్పినట్టు జరగలేదు.. కవిత ఊహించినట్టు రాలేదు.. మొత్తానికి మళ్లీ నిరాశ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు 5 నెలల నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆమె చేయని ప్రయత్నాలు అంటూ లేదు. తాజాగా సోమవారం కూడా సుప్రీంకోర్టులో బెయిల్ కు సంబంధించి కవితకు మరోసారి చుక్కెదురైంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 12, 2024 2:37 pm

MLC Kavitha

Follow us on

Delhi Liquor Scam : ” కవిత అనారోగ్యంతో బాధపడుతోంది. బరువు కూడా చాలా తగ్గింది. అందుకోసమే మాత్రలు వేసుకుంటున్నది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిశ్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో కవితకు కూడా బెయిల్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. కుట్రపూరితంగా నమోదు చేసిన కేసులు ఎప్పటికీ నిలబడలేవు. అవి త్వరలో నిరూపితమవుతాయి.” ఇవీ కవిత బెయిల్ కు సంబంధించి విలేకరులు సంధించిన ప్రశ్నకు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పిన సమాధానం.. అయితే ఆయన చెప్పినట్టుగా జరగలేదు. కవిత ఊహించినట్టుగానూ పరిస్థితి మారలేదు. మొత్తానికి ఈ సోమవారం కూడా నిరాశే ఎదురయింది. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది.

ఐదు నెలలపాటు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపు 5 నెలల నుంచి ఆమె జైల్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో బెయిల్ కోసం ఆమె చేయని ప్రయత్నాలు అంటూ లేదు. తాజాగా సోమవారం కూడా సుప్రీంకోర్టులో బెయిల్ కు సంబంధించి కవితకు మరోసారి చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ఒప్పుకోలేదు. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ” కవిత ఒక మహిళా ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్సీగా ఉన్నారు. విచారణ పేరుతో ఆమెను ఇంకెంతకాలం జైల్లో ఉంచుతారు. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. వారికి బెయిల్ మంజూరయింది. కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలని” రోహత్గీ వాదించారు.

జస్టిస్ గవాయి ఏమన్నారంటే..

రోహత్గీ వాదనల సమయంలోనే ఈడీ, సీబీఐ లకు నోటీసులు జారీ చేస్తామని జస్టిస్ గవాయి పేర్కొనడం విశేషం. ఇదే క్రమంలో కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు లాయర్ రోహత్గీ న్యాయస్థానాన్ని విన్నవించారు. ఇందుకు గవాయి ఒప్పుకోలేదు. వారు అభిప్రాయాలను వెల్లడించిన తర్వాతే.. వాదనలు వింటామని.. అప్పటివరకు ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఆగస్టు 20 కి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈలోపు అఫిడవిట్ ఫైల్ చేయాలని ఈడీ, సీబీఐ కి ఆదేశాలు జారీ చేసింది. ఇక కవిత ఇప్పటికే దిగువ న్యాయస్థానాలలో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు గట్టిగా కౌంటర్ ఇచ్చాయి..”కవిత సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారు. ఇలాంటి సమయంలో విచారణ అనేది పక్కదారి పడుతుంది. అలాంటప్పుడు ఆమె జైల్లోనే ఉండాలని” దర్యాప్తు సంస్థలు కోర్టుకు విన్నవించాయి. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ మంజూరు చేయలేదు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడంతో.. కవితకు కూడా ఊరట లభిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులు మరోసారి నిరాశలో మునిగిపోయారు. కాగా ఇటీవల కవిత అరెస్టుకు సంబంధించి తొలిసారి కేసీఆర్ స్పందించారు. బిడ్డ అరెస్టు అయితే ఈ తండ్రికి మాత్రం బాధ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.