Kadiyam Srihari Criticism: కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెట్టుకుంది. 2018 లోనూ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించింది. అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకుంది. 2014, 2018 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆటలు సాగాయి కానీ.. 2023 కి వచ్చేసరికి ఆ పరిస్థితి లేకుండా పోయింది. పార్టీ ఫిరాయింపుల వల్ల ఏర్పడిన ఇబ్బందిని గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి చవిచూసింది. అందువల్లే ఆ ప్రతీకారాన్ని మిగతా పార్టీల మీద తీర్చుకుంది. అయితే అన్ని రోజులు ఒకే విధంగా ఉంటాయని భారత రాష్ట్ర సమితి అనుకుంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో భారత రాష్ట్ర సమితి అనుకున్న లక్ష్యాలు మొత్తం తలకిందులయ్యాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. భారత రాష్ట్ర సమితి నుంచి ఏకంగా 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కడియం శ్రీహరి కూడా ఒకరు. ఆయన భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయింపులపై భారత రాష్ట్ర సమితి ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం వద్దకు వెళ్లడంతో.. తీర్పు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ లేఖ రాయడంతో ఇన్ని రోజులపాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారంతా.. తాము ఆ పార్టీలో చేరలేదని.. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని స్పష్టత ఇచ్చారు. అయితే ఇందులో కడియం శ్రీహరి ఎలాంటి లేఖ రాశారో తెలియదు గాని.. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల విలేకరులతో మాట్లాడిన ఆయన కీలక విషయాలను వెల్లడించారు.
పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అధికారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని శ్రీహరి ఇటీవల పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత నైతిక విలువలు కేసీఆర్ కు గుర్తుకు వస్తున్నాయని విమర్శించారు. అయితే కడియం శ్రీహరి మాట్లాడిన మాటలు ఇలా ఉంటే.. గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో మాత్రం మరో విధంగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి పోటీ చేయబోనని చెప్పారని… ఇవే తన చివరి ఎన్నికలు అని పేర్కొన్నారని.. రాజకీయంగా ఆయన చరిత్ర ముగిసిపోయినట్టేనని రాసుకోచ్చింది. రాజకీయంగా కడియం శ్రీహరి బలమైన నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా.. కెసిఆర్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. అటువంటి వ్యక్తి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అంటే రాజకీయంగా సన్యాసం తీసుకున్నట్టు కాదు కదా.. పాపం గులాబీ పార్టీ సోషల్ మీడియా అడ్డగోలుగా ప్రచారం చేస్తోంది. తన కింద ఉన్న మరకలను మరచిపోతోంది. అలాగని ఇక్కడ కడియం శ్రీహరి విలువలు ఉన్న నాయకుడు అని చెప్పడం లేదు. గులాబీ పార్టీ మీద గెలిచి ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అంతేకాదు తన కుమార్తెకు గులాబీ పార్టీ బీఫారం ఇచ్చినప్పటికీ.. పక్కనపెట్టి కాంగ్రెస్ లో లాబీయింగ్ చేసుకొని వచ్చారు. తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకొని ఏకంగా ఎంపీని చేసుకున్నారు. ఇంత జరిగింది కాబట్టి సహజంగానే గులాబీ పార్టీ సోషల్ మీడియాకు ఆగ్రహం ఉంటుంది. ఆ ఆగ్రహాన్ని ఇలా వ్యక్తం చేస్తోంది.
ఇవే నా చివరి ఎన్నికలు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
చేతులెత్తేసిన కడియం శ్రీహరి pic.twitter.com/R3AjczwfZX
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025