
Crime News: నమ్మిన వాడే నట్టేట ముంచాడు. సహజీవనం చేసిన వాడే కడతేర్చాడు. తోడుంటానని చెప్పి తోడేల్లా ప్రవర్తించాడు. ప్రియుడితో కలిసి ఉంటున్న మహిళను అంతం చేశాడు. మరొకరితో చనువుగా ఉంటుందని అనుమానమే పెనుభూతంగా మారి ఆమె ప్రాణాలు తీసింది. వివాహేతర సంబంధం పెట్టుకుని కొన్నాళ్లు కలిసి ఉన్నారు. కానీ ఆమె ప్రవర్తనపై అతడిలో పెరిగిన అనుమానమే ఆమెకు అడ్డమైంది.
హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో నివాసం ఉంటున్న మహిళ కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాప్రా వంపూగూడకు చెందిన మహిళ (48), భర్త, కుమారుడు, మనవరాలితో కలిసి నివసిస్తోంది. పదేళ్ల క్రితం సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో పని చేసేది. అక్కడే పనిచేస్తున్న మారేడుపల్లికి చెందిన అశోక్ (36)తో పరిచయం ఏర్పడింది. దీంతో వివాహేతర సంబంధానికి దారి తీసింది. అశోక్ కుటుంబం కాప్రా సమీపంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉంటోంది. తన కంటే 12 ఏళ్లు చిన్నోడితో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది.
ప్రియురాలితో గడిపేందుకు సమీపంలోనే మరోగది అద్దెకు తీసుకున్నాడు అశోక్. విషయం కాస్తా అశోక్ భార్యకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో అశోక్ ప్రియురాలిని కలుసుకోలేకపోయేవాడు. అయితే ఇటీవల ప్రియురాలు మరికొందరితో చనువుగా ఉండడం గమనించిన అశోక్ ఆమెను ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఈనెల 5న ఆమెను రూంకు రావాలని చెప్పాడు. దీంతో మహిళ చికెన్ తీసుకొస్తానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో అశోక్ పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరం ఒప్పుకున్నాడు. ఆ మహిళను తానే అంతమొందించానని చెప్పాడు. ఇంకొకరితో చనువుగా ఉంటుందనే అనుమానంతో ప్రియురాలి గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు శామీర్ పేట మండలం లాల్ గడిమలక్ పేట ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని వెలికి తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అశోక్ పై హత్య కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు.