Komatireddy Venkat Reddy: కొంతకాలంగా టాలీవుడ్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన నుంచి మొదలైన ఇష్యూ అల్లు అర్జున్ అరెస్టు, ఆయన ఇంటిపై ఓయూ ఐకాస దాడి ..తర్వాత సినీరంగంతో పాటు విపక్షాల నుంచి వెల్లువెత్తిన నిరసనలు .. ఈ క్రమంలో సీఎం సైతం దాడిని ఖండించడం.. తర్వాత రంగంలోకి దిగిన దిల్ రాజ్ మధ్యవర్తిత్వం.. మొత్తం ఎపిసోడ్లో మంత్రి కోమటిరెడ్డి పోషించిన తీరు ఆసక్తికరం..
విలక్షణ నేత వెంకన్న..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్లో విలక్షణ నేత. ముక్కుసూటి వ్యక్తిత్వం. ప్రస్తుత కేబినెట్లో మంత్రి కూడా. రోడ్లు, భవనాలతో పాటు సినిమాటోగ్రఫీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ఈయనకు మాస్ లీడర్ అనే గుర్తింపు ఉంది. సభలు, సమావేశాలు.. వేదిక ఏదయినా చివరకు అసెంబ్లీ అయినా.. ఆ మాట తీరు ఒక్కటే. అదే యాస. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలోనూ అధికార పార్టీలో ఉండి కూడా ప్రజల ఆకాంక్షను డిల్లీకి వినిపించిన ఫైర్ లీడర్. రెండు పర్యాయాలు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఉద్యమనేత. ప్రభుత్వం మాత్రం ఆమోదించలేదు. ఇక పదేళ్ల కేసీఆర్ పాలనలోనూ ‘హస్తం’ వీడని నేతకు అధిష్ఠాన ఆశీర్వాదం ఎక్కువే. తన మాట నెగ్గించుకోవటంలో మాటతూలిన దయాకర్ (సీఎం అనుచరుడిగా పేరున్న)కు టికెట్ రాకుండా.. చక్రం తిప్పడమే తన సత్తా కు నిదర్శనం.
మాస్ మాటలతో ఆకట్టుకునేలా..
జనంలోనే ఎక్కువగా గడిపే ఈ నేత యాసతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. స్వయంగా రేవంత్ సైతం వెంకన్న మాటలకు ఫిదా అయిన సందర్భాలూ ఉన్నాయి. కేబినెట్ లోనూ అందరితో కలుపుకుపోయే మంత్రిగా పేరుంది. శాసనసభ లోనూ ప్రత్యర్థులను తన మాటలతో ఎదురుదాడి చేసే వెంకన్న..తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కీలక భూమిక పోషించారు. తన కుమారుడి పేరిట గల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ శాఖ మంత్రిగా ఓ దశలో సినీరంగ ప్రముఖుల తీరును ఎండగట్టి పొలిటికల్ హీట్ పెంచారు. తాజాగా ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చలోనూ కీ రోల్ పోషించారు.
ప్రతీక్ ఫాండేషన్..
తన కుమారుడు రోడ్డు ప్రమాదానికి గురై అకాల మరణం పొందిన అనంతరం ప్రతీక్ ఫాండేషన్ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వెంకట్ రెడ్డి. నల్గొండలో రూ. 3.5కోట్లతో కళాశాల ఏర్పాటు చేశారు. తన కుమారుడి మాదిరిగా ఎవరూ రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు గాను అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే ఏటా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు అండగా నిలుస్తున్నారు.