https://oktelugu.com/

MIM Party : ఇరకాటంలో ఎంఐఎం.. కేసీఆర్‌తో దోస్తానా ఎంత పనిచేసే..!

రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఈ ఎఫెక్ట్ కాస్త ఇప్పుడు ఎంఐఎంపై పడిందన్న టాక్ నడుస్తోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 25, 2024 / 01:28 PM IST

    MIM-KCR

    Follow us on

    MIM Party :  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన నుంచి ఎంఐఎంతో ఉన్న దోస్తానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బీఆర్ఎస్ చేపట్టిన ప్రతి పనికీ ఎంఐఎం తోడుగా ఉంటూ వచ్చింది. ఏ నిర్ణయం తీసుకున్నా అన్నింటికీ ఓకే చెప్పింది. ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ పార్టీకి ఎంఐఎం మిత్రపక్షంగా కొననసాగింది. ప్రభుత్వంలోనూ ఎలాంటి అడ్డు చెప్పకుండా.. అన్ని కార్యక్రమాలను మెచ్చుకునే వారు ఎంఐఎం పార్టీ నేతలు. ఎన్నో సందర్భాల్లోనూ, తమ సభల్లోనూ కేసీఆర్ పాలనపై కితాబు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీతో అంతటి సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎంఐఎం పార్టీ ముఖ్యనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలు ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఇప్పుడు వారి పరిస్థితి తయారైందని ప్రచారం వినిపిస్తోంది. కేసీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగించినందుకే ఇప్పుడు వారు ఇరకాటంలో పడాల్సి వచ్చిందని అంటున్నారు.

    అయితే.. రాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. ఈ ఎఫెక్ట్ కాస్త ఇప్పుడు ఎంఐఎంపై పడిందన్న టాక్ నడుస్తోంది. మొన్నటి జమ్మూకశ్మీర్, హర్యానా ఎన్నికలు జరిగాయి. అవి ముగిశాయి. తాజాగా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల హవా నడుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎన్నికల వేళ ఎంఐఎం ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నదట. మహారాష్ట్రలో పోటీచేసి కొద్దోగొప్పో సీట్లు సాధించవచ్చని ఆశపడిన ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బిగ్ షాక్‌నే ఇచ్చిందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

    వాస్తవానికి ఎంఐఎం ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా కొనసాగుతూ వచ్చింది. జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్‌తోనే ముందు నుంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చింది. అయితే.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎంఐఎం తన స్టాండ్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. దాంతో కేసీఆర్ పక్షాన చేరుకుంది. దాంతో కాంగ్రెస్‌తో ఎంఐఎంకు విభేదాలు వచ్చాయి. దాంతో తెలంగాణలో పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్న ఎంఐఎం ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా సానుకూల స్పందన రాలేదని సమాచారం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలతో ఉన్న దోస్తానా నేపథ్యంలో ఎంఐఎంను ఆ పార్టీ లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కీలకమైన రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ ఓట్లతో సత్తా చాటాలనుకున్న ఎంఐఎం ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో ఆ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందా.. లేక కాంగ్రెస్‌తో పొత్తు లేకపోవడంతో బరి నుంచి తప్పుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది.