Congress Vs BRS: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కారంగ్రెస్ సర్కార్.. గత పాలకుల అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది. ప్రస్తుతం జిల్లాస్థాయిలో చోటామోటా నేతలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల అక్రమ దందాలపై దృష్టిపెట్టింది. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కేసులు పెడుతోంది. కొందరిని జైలుకు కూడా పంపింది. తాజాగా కేసుల నమోదు అంశం ఎమ్మెల్యేల వరకు చేరింది. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై భూకబ్జాల కేసు పెట్టారు. ప్రస్తుతం అంతా కిందిస్థాయి నేతలపైనే దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. పెద్ద తలల అక్రమాలను తవ్వుతోంది.
లోక్‌సభ ఎన్నికల వరకు..
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్‌కు అప్పగించింది. విచారణ జరిపిన విజిలెన్స్ ఇప్పటికే ప్రాథమిక నివేదిక రూపొందించింది. రూ.3,200 కోట్లు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించింది. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా దానిని ప్రభుత్వం లీక్ చేసింది. తద్వారా బీఆర్‌ఎస్ నేతలకు ముందుంది మొసళ్ల పండుగల అని చెప్పకనే చెప్పింది. అదేవిధంగా గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పీఎస్ కల్యాణ్‌పై కేసు నమోదైంది. నెక్స్ట్ వికెట్ తలసానే అన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసును అవినీతి నిరోధక శాక టేకప్ చేసింది. అంతకుముందు మంత్రి కార్యాలయంలో ఫైళ్ల మాయం, తరలింపుపై నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో తలసాని పేరు వినిపిస్తోంది. ఫార్ములా ఈరేస్‌కు ఎలాంటి ఆదేశాలు లేకుండా పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్ రూ.55 కోట్లు ప్రైవేటు కంపెనీకి కేటాయించడంపై ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నోటీసులకు అరవింద్‌కుమార్ పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. రూ.55 కోట్లు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. నాటి మంత్రి కేటీఆర్ ఇవ్వమంటే ఇచ్చానని అరవింద్‌కుమార్ చెబుతున్నారు.
మరికొన్ని..
ఇవి కాకుండా లిస్టులో చాలా అంశాలే కనిపిస్తున్నాయి. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్‌పై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రభుత్వం చేస్తున్న విచారణలన్నీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలవైపే వేలెత్తి చూపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్టులకు దిగుతుందన్న ప్రచారం జరుగుతోంది. అంతకన్నా ముందే ఒకరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. అయితే కక్ష సాధింపు చర్యలు అన్న అపవాదు రాకుండా ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల వరకూ ఆధారాలన్నీ సేకరించి పకడ్బందీగా సేకరించి పక్కాగా బొక్కలో తోయాలని భావిస్తున్నట్లు సమాచారం.