Teenmaar Mallanna : కాంగ్రెస్ నేతలకు సెగ తగులుతోంది. అలివికానీ ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన నేతలకు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చకపోవడంతో ప్రజలు, నిరుద్యోగుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో నేతలు కనిపిస్తే పథకాలపై నిలదీస్తున్నారు. ఇప్పుడు సిటీలలోనూ ఈ వేడి రాజుకుంది. కాంగ్రెస్ కు సపోర్టు చేసి గెలిచిన తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పై నిరుద్యోగులు దాడి చేసే వరకూ వ్యవహారం వెళ్లిందంటే.. కాంగ్రెస్ పై జనాల్లో ఎంత కసి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిర్వహించిన ప్రెస్‌మీట్ అనూహ్య ఉద్వేగాలకు వేదికైంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై జరుపుతున్న విలేకర్ల సమావేశానికి డీఎస్సీ నిరుద్యోగులు అడ్డుపడ్డారు. తమ సమస్యలను పట్టించుకోకుండా రాజకీయం కోసం మాత్రమే మాట్లాడుతున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మా ఓట్లతో నువ్వు గెలిచావు. ఇప్పుడు మా సమస్యల గురించి ఒక్క మాటైనా మాట్లాడవా?” అంటూ మల్లన్నను ప్రశ్నించారు నిరుద్యోగులు. డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం, ఉద్యోగ నియామకాల ఆలస్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ న్యాయం కోసం పోరాడాల్సిన నేతలు మౌనంగా ఉండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉన్న తీన్మార్ మల్లన్న అక్కడి నుండి నేరుగా వెళ్లిపోయారు. నిరుద్యోగుల ఆగ్రహం ఎదుర్కోవడం ఆయనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ఈ ఘటన ప్రెస్‌మీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే సమయంలో, డీఎస్సీ బాధితులు మాట్లాడుతూ “పదవి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను మర్చిపోతారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం మానుకోవాలి” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనను సామాజిక మాధ్యమాల్లో చాలామంది పంచుకుంటూ మల్లన్న తీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన నేతలు, ఎన్నికల తర్వాత ప్రజల మాట విని పోరాడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.