BJP following Congress : బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. సొంత పార్టీలోని తన వ్యతిరేక వర్గీయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. అంటే ఇలాంటి వాతావరణం ఒకప్పుడు బీజేపీకి ఉండేదా? బీజేపీలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకుంటారా? అనుకోవడం ఏంటి ఏకంగా జరుగుతుంటే.. మొన్నటిదాకా చీలికలకు పీలికలకు కాంగ్రెస్ చిరునామాగా ఉండేది. కానీ, ఇప్పుడది ఐక్యతారాగం ఆలపిస్తోంది. ఎవరికి వారే కాకుండా.. మనమంతా ఒకటే అనే సంకేతాలు ఇస్తోంది. అదేం దౌర్భగ్యామో తెలియదు కానీ బీజేపీ కాంగ్రెస్ బాటలో నడుస్తోంది.
కాంగ్రెస్‌లో కుదుటపడుతున్నాయి
‘‘నా మీద కొందరు ఫిర్యాదులు చేశారు. అయినా సరే.. కార్యకర్తలంతా బీజేపీ కోసం పనిచేస్తున్నారు. మోదీ పార్టీ ద్వారా మాత్రమే ఎమ్మెల్యేలు కావాలని చాలామంది బీజేపీలో చేరారు. దయచేసి తప్పుడు ఫిర్యాదులు చేయడం, తప్పుడు రిపోర్టులు ఇవ్వడం బంద్ చేయండి. నమ్ముకుని వచ్చిననాయకులను, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తల ఆశలను వమ్ము చేయకండి. కిషన్‌రెడ్డి సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి. ఆయననైనా ప్రశాంతంగా పనిచేయనివ్వండి. తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి రాకుంటే.. మళ్లీ కష్టం’’ అని సంజయ్ వ్యాఖ్యానించారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం గట్టిగా ఉండే కాంగ్రెస్‌లో.. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతుం డగా.. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉండటం విశేషం.
అర్ధంతరంగా వెళ్లిపోయారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నుంచి ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఈ ఘటన పార్టీ వర్గాల్లో చర్చకు దారితీయడంతో.. ఆమె ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రయత్నించినవారు ఎవరైనా ఉన్న సందర్భంలో అక్కడ ఉండడం అసౌకర్యం.. అసాధ్యం’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించే విజయశాంతి ఈ వ్యాఖ్య చేసి ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఏం మాయ చేశారో
మరో వైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ఏం మాయ చేశారో, ఈడీ అధికారులను ఎలా మేనేజ్ చేశారోగానీ లిక్కర్ స్కాం కేసు నుంచి కవిత బయటపడ్డారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతోనే బీజేపీ బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న ప్రచారం చేస్తున్నారని బాంబు పేల్చారు. ‘ప్రజల మనసులో కేసీఆర్ లేరు. కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసిన లక్ష కోట్ల దోపిడీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయి. కేసీఆర్‌ను, ఆయన కుమారుడిని కూడా బీజేపీ జైల్లో పెడుతుందని’ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బండి సంజయ్‌ని చూడగానే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని, దీంతో బాత్‌రూంలోకి వెళ్లి ఏడ్చానని’ పేర్కొన్నారు.
కాలమే సమాధానం చెప్పాలి
మరి నేతలు ఇలా తలా మాట మాట్లాడటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్ణాటక ఓటమి అనంతరం బీజేపీ జాతీయ కార్యవర్గం ఇక్కడి పార్టీని పట్టించుకోవడం మానేసిందనే వ్యాఖ్యలు విన్పించాయి. వాటికి బలం చేకూర్చే విధంగానే ఇక్కడి పరిస్థితులు కన్పించాయి. తీరా బండి సంజయ్‌ని మార్చడం తర్వాత ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిషన్‌రెడ్డి ఏం చేస్తారు? పార్టీని గాడిలో పెడతారా? ఒకప్పుడు ప్రత్యామ్నాయం మేమే అని చేసిన ప్రచారాన్ని నిజం చేస్తారా? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.