Khairatabad Ganesh Immersion: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో హైదరాబాద్‌లోని ఖైతరాబాద్ మహా గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలతోపాటు విదేశీయులు కూడా మహాగణపతి దర్శనానికి వస్తారు. ఈసారి కూడా భారీగా భక్తులు తరలి వచ్చి ఖైతరాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. తొమ్మిది రోజులు భక్తుల పూజలందుకున్న మహాగణపతి గురువారం నిమజ్జనానికి తరలాడు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటల తర్వాత నిమజ్జనంతో ముగిసింది. జై భోళో గణేష్ మహారాజ్‌కి జై అంటూ భక్తుల నినాదాల మధ్య గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ – 4 వద్ద మహాగణపతి నిమజ్జనం జరిగింది.
క్రేన్ నంబర్ 4 వద్ద చివరి పూజలు..
నిమజ్జనానికి తరలిన ఖైరతాబాద్ బడా గణపతికి ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద చివరి పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఈ పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమం మొదలు పెట్టారు. సుమారు గంటపాటు నిమజ్జనం ప్రక్రియ కొనసాగింది. ఈ గంటసేపు మిగత గణనాథుల నిమజ్జనం నిలిపివేశారు.
భారీగా తరలి వచ్చిన భక్తులు..
మహాగణపతి నిమజ్జనం కనులారా వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇసుకేస్తే రాలనంతగా జనం క్రేన్ నంబర్–4 వద్దకు చేరుకున్నారు. బైబై గణేశా అంటూ ఘనంగా బొజ్జ గణపయ్యకు వీడ్కోలు పలికారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. మహాగణపతి నిమజ్జనానికి రెండు భారీ క్రేన్లను ఉపయోగించారు.
షెడ్యూల్‌కు గంట ముందే..
ఇదిలా ఉండగా.. షెడ్యూల్ కంటే గంట ముందుగానే బడా గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటలకు యాత్ర ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. కానీ వాహనంలోని మహాగణపతిని తరలించే పనులు ఉదయం 5:30 గంటలకే పూర్తి కావడంతో 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభించారు. ఏడు గంటలపాటు శోభాయాత్ర నిర్విర్వామంగా కొనసాగింది. దారి పొడువుగా గణపయ్యకు భక్తులు నీరాజనాలు పలికారు. మహాగణపతి ముందు యువత తీన్మార్ డ్యాన్సులతో హోరెత్తించారు.