Supreem Court-Revanth : సుప్రీంకు బేషరతుగా క్షమాపణ.. వెనక్కి తగ్గిన సీఎం రేవంత్.. అసలేం జరిగిందంటే..

సుప్రీం కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. కవిత బెయిల్ విషయంలో తన వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..

Written By: Mahi, Updated On : August 30, 2024 2:23 pm

Supreem Court-Revanth

Follow us on

Supreem Court-Revanth : తెలంగాణలో ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా రాజకీయాలు మాత్రం కాక మీదే ఉన్నాయి. ఒక వైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తుకు పైఎత్తులతో తెలంగాణ రాజకీయాలు మంచి వేడిని పుట్టిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పనైపోయిందని కాంగ్రెస్, బీజేపీ, బీజేపీ తో దోస్తీ కట్టిందని కాంగ్రెస్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మిలాఖత్ అంటూ బీజేపీ మాటల దాడిని కొనసాగిస్తున్నాయి. ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష నేతలందరికీ మాత్రం మంచి పని చెబుతున్నారు. మరోవైపు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు.. ముందుగా మీడియాకు లీకులిస్తూ హైరానా పెట్టిస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాక ఈ వేడి మరింత పుట్టింది. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు రైతుల ఆందోళనలను పక్కదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఈ కూల్చివేతల పర్వం మొదలు పెట్టారని ప్రతికపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇవేమి పట్టించుకోకుండా రేవంత్ కూల్చివేతల పై సీరియస్ గా ముందుకెళ్తున్నారు. హైడ్రా తరహాలో జిల్లాల్లోనూ ఈ ఆక్రమణల కూల్చివేతల పర్వం ఉంటుందని మరో బాంబు పేల్చారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు అయిన కవితకు బెయిల్ వచ్చింది. దీంతో అందరి టర్న్ అటు వైపు తిరిగింది. కవితకు బెయిల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

అయితే కవిత బెయిల్ విషయంలో రేవంత్ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్రంలోని బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు గురువారం సుప్రీంలో విచారణకు వచ్చింది. ఇదే సమయంలో రేవంత్ వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. దీనిపై జస్టిస్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యున్నత న్యాయస్థానానికి రాజకీయాలు అంటగడుతారా అంటూ ప్రశ్నించింది. మీకు న్యాయవ్యవస్థఫై నమ్మకం లేకుంటే మీ కేసును కూడా వేరే రాష్ర్టానికి బదిలీ చేస్తామని వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ మందలించింది. ఇదే అంశం ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.

ఇక సుప్రీం మందలించడంతో సీఎం రేవంత్ దిగిరాక తప్పలేదు. ఆయన ఈ వ్యాఖ్యలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మధ్య జరిగిన ఒప్పందం వల్లే బెయిల్ వచ్చిందని చేసిన వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్ అయిన నేపథ్యంలో మరునాడు ఆయన స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన సుప్రీంకు క్షమాపణలు చెప్పారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు అత్యంత గౌరవం, ధృడమైన విశ్వాసం ఉందంటూ పేర్కొన్నారు. కొన్ని పత్రికలు నాకు ఆపాదించిన వ్యాఖ్యల విషయంలో నేను బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నా అంటూ ఆయన ఈ పోస్టులో తెలిపారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు బీఆర్ఎస్ సహకరించిందని చెప్పారు. వారి మధ్య డీల్ కుదిరిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ కేసులో కవిత అరెస్టు సందర్భంగా కూడా ఇదంతా నాటకమని, మోదీ, కేసీఆర్ సంయుక్తంగా ఆడుతున్న ఆటని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో రాజకీయ డ్రామాలు మొదలుపెట్టారని పేర్కొన్నారు.