CM Revanth Reddy : పనికి వస్తావనుకుంటే.. పరువు తీస్తున్నావ్‌.. దానం’కు షాకిచ్చిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌) భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు కట్టామన్నదానితో సంబంధం లేకుండా ఆక్రమణలను కూల్చివేస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతలు అని ఆలోచించడం లేదు.

Written By: Raj Shekar, Updated On : August 22, 2024 8:37 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy :  హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌)ను ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు ఓఆర్‌ఆర్‌ వరకు హైడ్రాకు అధికార పరిధిని అప్పగించింది. హైడ్రా చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఇందులో సభ్యులుగా ఉన్నరు. హైడ్రా కమిషనర్‌గా ఐపీఎస్‌ రంగనాథ్‌ వ్యవహరిస్తున్నారు. హైడ్రా ఏర్పడి దాదాపు నెల రోజులు కావస్తోంది. పరిధి, విధులు ఖరారైన వెంటనే రంగంలోకిదిగిన హైడ్రా హైదరాబాద్‌లో ఆక్రమణల తొలగింపుపై దృష్టిట్టింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా ఆక్రమణలను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఖైరతాబాద్‌ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌లోచేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నందగిరిహిల్స్‌లో హైడ్రా ఆక్రమణలను తొలగిస్తుండగా ఆయన తన అనుచరులతో అడ్డుకోబోయారు. దీంతో పోలీసులు దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు. దీంతో దానం నాగేందర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ’కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుంది.. అందుకే నాపై కేసు పెట్టారు.’ అంటూ హైడ్రా కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌పై ఫైర్‌ అయ్యారు. రంగనాథ్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఆ సమయంలో సీఎం రేంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే సీఎం అనుమతితోనే దానంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దానం నాగేందర్‌ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా దానం తీరుపై రేవంత్‌రెడ్డి ఫైర్‌ అయినట్లు తెలిసింది.

దానం తీరుపై ఆగ్రహం..
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై సీఎం రేవంత్‌ సీరియస్‌గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల దానం వ్యవహరశైలిపై సీఎం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హైæడ్రాపై దానం చేసిన కామెంట్లపై రేవంత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలా చేయడం ఏంటని సీఎం దానం నాగేందర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. రేవంత్‌ క్లాస్‌ తీసుకోవడంతో దానం నాగేందర్‌ వెనక్కి తగ్గారు. హైడ్రా మంచిపని చేస్తుందంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అయినా.. సీఎంకు దానంపై కోపం చల్లారలేదన్న టాక్‌.

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఖాతా తెరవలేదు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా.. సత్తా చాటాలన్న లక్ష్యంగా ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్‌ ను పార్టీలో చేర్చుకున్నారు. ఆ సమయంలో సీనియర్లు వద్దన్నా రేవంత్‌ పట్టించుకోలేదు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా కూడా పని చేసిన దానం నాగేందర్‌ను చేర్చుకుంటే పార్టీని మళ్లీ బలోపేతం చేయవచ్చని రేవంత్‌ భావించారు. పార్టీకి పనికి వస్తాడని అనుకుంటే.. నష్టం కలిగించేలా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు దానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో పార్టీ బలోపేతం కోసం పని చేయకుండా వివాదాల్లో దూరడంపై సీఎం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.