Revanth Reddy : పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్లో ముందస్తు విడుదల లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించడంతో.. పుష్ప సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ జైలుకు వెళ్ళక తప్పలేదు. ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ.. నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి మరోసారి ఈ వివాదాన్ని రాజేయడంతో రాజకీయ అంశంగా మారింది. ఇందులోకి భారత రాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో ఒకసారిగా వివాదం జటిలమైంది. శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. తగినంతగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటేనే ఈవెంట్లకు అనుమతి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బౌన్సర్ల విషయంలోనూ అత్యంత కఠినంగా ఉంటామని హెచ్చరించారు. చివరికి అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత కూడా సెలబ్రిటీలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
షాక్ ఇచ్చిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. సినిమా నిర్మాతలు మొత్తం గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఆ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మరోసారి తన విధానాలను స్పష్టం చేశారు..”అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉంటాను. ఆ నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. బౌన్సర్ల విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తాం. శని పరిశ్రమకు నేను వ్యతిరేకం కాదు. ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. తెలంగాణలో చిత్ర షూటింగ్స్ కు మరిన్ని రాయితీలు ఇస్తాం. దేవాలయ పర్యాటకాన్ని, టూరిజాన్ని డెవలప్ చేస్తాం. దీనిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రమోట్ చేయాలి. సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసే ఈవెంట్లలో అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత సెలబ్రెటీలు తీసుకోవాలని” రేవంత్ రెడ్డి సినిమా ప్రముఖులకు సూచించినట్టు తెలుస్తోంది.
నిర్మాతలు ఏమన్నారంటే
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో జరిగిన సమావేశం అనంతరం టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సానుకూలంగా వ్యాఖ్యానించారు. ” ముఖ్యమంత్రితో జరిగిన సమావేశం సానుకూలంగా జరిగింది. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు శుభదినం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి సహకరిస్తారని మాట ఇచ్చారు. ఆ మాట మీద ఉంటానని ప్రకటించారు. ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన రాయితీలను ఇస్తామని వెల్లడించారు. ఇది గొప్ప సమావేశం. టాలీవుడ్ దిశ దశను పూర్తిగా మార్చుతుందని” అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రితో సమావేశం ముగిసిన తర్వాత ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. ” ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పని చేసిన వారంతా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకరించారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమను బాగానే చూసుకుంటుందని నమ్మకం నాకుంది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డీల్ రాజును నియమించడాన్ని స్వాగతిస్తున్నానని” రాఘవేంద్రరావు పేర్కొన్నారు.