CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో మొన్నటిదాకా జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సొంత కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. చివరికి భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో ఆమె భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి, శాసనమండలి సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తన మానస పుత్రిక జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సింగరేణి లోను తన రాజకీయ ప్రస్తానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు.
కల్వకుంట్ల కవిత తన సొంత కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ స్పందించలేదు. అయితే తొలిసారిగా ఆయన కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.. ” కవితకు నేను సపోర్ట్ చేయడం లేదు. ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది లేదు. ఆమె వస్తానంటే నేను ఒప్పుకోను. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి ఆడపిల్ల పై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని తెలంగాణ ప్రజలు ఎప్పుడో బహిష్కరించారు. ఆ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇటువంటి విషయాలు తెలంగాణ సమాజానికి సంబంధం లేనివి. అసలు తెలంగాణ సమాజం వారి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవాలి. వారి పార్టీలో జరుగుతున్న విషయాల గురించి ఎందుకు మాట్లాడుకోవాలని” రేవంత్ వ్యాఖ్యానించారు.
కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు
కవిత విషయాన్ని మాత్రమే కాకుండా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విషయంలో కూడా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం నిర్మాణంలో అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందులో నిజాలను వెలికితీయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థకు ఆ బాధ్యతను అప్పగించామన్నారు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఆ విషయం మీద మాట్లాడటం లేదని రేవంత్ ప్రశ్నించారు.” రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదు. ఈ విషయం గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థను కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చోటు చేసుకున్న అక్రమాలపై వేగంగా విచారించాలని ఆదేశాలు జారీ చేయడం లేదు. కనీసం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇటువంటి వ్యక్తులు మిగతా విషయాల గురించి మాట్లాడుతుంటారు. వారిద్దరూ ఒకటే. ఒకరిని ఒకరు కాపాడుకుంటారని” రేవంత్ ఆరోపించారు.. కల్వకుంట్ల కవిత వ్యవహారంపై ఇన్ని రోజులకు ముఖ్యమంత్రి స్పందించడంతో రాజకీయంగా సంచలనంగా మారింది. మరి దీనిపై గులాబీ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.