Konda Surekha Controversy: నిన్న సాయంత్రం నుంచి ఇవాల్టి వరకు తెలుగు మీడియాలో కొండా సురేఖ గురించి రకరకాల కథనాలు ప్రసారమవుతున్నాయి. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్లో ఇంత జరుగుతుందా? అనే ఆశ్చర్యం అందరిలోనూ కలుగుతోంది. వాస్తవానికి సుమంత్ వ్యవహార శైలి మొదటి నుంచి కూడా అడ్డగోలుగానే ఉంది. కొండ సురేఖ అతడిని ప్రైవేట్ ఓఎస్డిగా నియమించుకున్నారు. అతడు ఏకంగా అటవీశాఖ, దేవాదాయ శాఖలో వేలు పెట్టాడు. కొండా సురేఖ అండ చూసుకొని రెచ్చిపోయాడు. అంతేకాదు వేధింపులను పరిపాటిగా మార్చుకున్నాడు. చివరికి దక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించడంతో అతడి అసలు వ్యవహారం బయటపడింది. దక్కన్ సిమెంట్ యాజమాన్యం ఈ విషయాన్ని బయట పెట్టడంలో తెరవెనక ఓ మంత్రి ముఖ్యపాత్ర పోషించారని తెలుస్తోంది.
ఎప్పుడైతే సుమంత్ ను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందో.. అప్పటినుంచి కొండా సురేఖ, రేవంత్ రెడ్డికి గ్యాప్ పెరిగిపోయింది. దేవాదాయ శాఖలో శ్రీనివాసరెడ్డి ప్రవేశించడం.. ఆయన సంస్థకు మేడారం ఆలయ అభివృద్ధి పనులు అప్పగించడం.. ఈ పరిణామాలు సురేఖకు ఆవేదన కలిగించాయి. ఇదే విషయాన్ని ఆమె అధిష్టానం దృష్టికి తీసుకుపోయినట్టు తెలుస్తోంది. దీంతో ముఖ్యమంత్రి రంగ ప్రవేశం చేశారని.. కొండా దంపతులకు క్లాస్ తీసుకున్నారని మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే వీటిని సురేఖ ఖండించారు. మురళి కూడా వైయస్ తర్వాత రేవంత్ తనకు అంతటివాడని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తారని ప్రకటించారు. ఇవన్నీ జరుగుతుండగానే కొండా సురేఖ ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన పోలీసు పోస్టును తొలగించారు. సెక్యూరిటీ సిబ్బందిని కూడా తగ్గించారు. కొండా సురేఖ గురువారం సాయంత్రం మంత్రివర్గ భేటీకి గైర్హాజరయ్యారు. భట్టి విక్రమార్కతో తన ఆవేదన చెప్పుకుని బయటకు వెళ్లిపోయారు. మరోవైపు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మేడారంలో చేపడుతున్న పనులను పర్యవేక్షించే బాధ్యత ఆర్ అండ్ బీ కి ప్రభుత్వం అప్పగించింది. సూపర్ విజన్ స్థాయి మాత్రమే దేవాదాయ శాఖకు ఇచ్చింది.
ఇవన్నీ కూడా కొండా సురేఖకు ఇబ్బంది కలిగించే పరిణామాలుగా మారిపోయాయి. దీనికి తోడు రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా వెళ్తున్నారని.. ఏ క్షణమైనా సరే సురేఖ రాజీనామా చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే గనక జరిగితే తెలంగాణ రాజకీయాలలో పెను ప్రకంపనలు చోటు చేసుకోవడం ఖాయం. రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అనే వార్తలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని రేవంత్ మీనాక్షితో చెప్పారని.. దీంతో ఆమె సురేఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.. సురేఖ కొద్దిరోజులు ఇలాగే ఉంటారని.. ఆ తర్వాత మునుపటిస్థితికి వచ్చేస్తారని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.
మామూలుగా అయితే పోలీసులు ఎవరైనా తమను అడ్డుకుంటే నాన్ బేయిలబుల్ కేసులు పెడతారు. కొండా సుస్మిత విషయంలో పోలీసులు మాత్రం ఇంతవరకు ఎటువంటి కేసులు పెట్టలేదు. అంటే విఐపిలు, బిడ్డలకు నిబంధనలు అడ్డురావాంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం రాత్రి హైదరాబాదులోని కొండా సురేఖ నివాసం వద్ద ఆమె కుమార్తె సుస్మిత సుమంత్ ను పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుపడ్డారు. దీనిపై పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేసులు నమోదు చేశామని చెప్తున్నారు గానీ.. ఇంతవరకు ఒక అడుగు కూడా వేయలేకపోయారు. మరి దీనిపై రేవంత్ ఎటువంటి ఆదేశాలు ఇస్తారు? పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.