CM Revanth Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. ఎవరికి వారు పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కేసీఆర లోక్‌సభ ఎన్నికల వేళ రైతు ఎజెండాతో పొలం బాట పడ్డారు. మొన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీరు అందక పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. రైతులతోపాటు సిరిసిల్లలోని చేనేత కార్మికుల సమస్యలపైనా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలు రేవంత్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. తీవ్ర పదజాలంతో దూషించారు. చవటలు, దద్దమ్మలు, కుక్కల కొడుకులు, లఫంగాలు అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీంతో శనివారం (ఏప్రిల్ 6న) తుక్కుగూడ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌రెడ్డి దీటుగా సమాధానం చెప్పారు. ఏదిపడితే అది మాట్లాడితే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానన్నారు. కేసీఆర్‌ను నక్కతో పోల్చారు. జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఏది పడితే అది మాట్లాడితే..
కరీంనగర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చేసిన విమర్శలపై ఐదుగురు మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడారు. కేసీఆర్ భాష తీరును ఖండించారు. పొన్నం, ఉత్తం, కోమటిరెడ్డి, సురేఖ, సీతక్క, జూపల్లి కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. వీరంతా మాట్లాడింది ఒక ఎత్తయితే.. తుక్కుగూడ సభలో కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కుక్కలు నక్కలు బయల్దేరాయని మొదలు పెట్టిన రేవంత్‌రెడ్డి కేసీఆర్ వాడిన భాషపై మండిపడ్డారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ వాడే భాష ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేందుకు నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని అంటూ ఇచ్చిపడేశారు.
జానారెడ్డి పేరెందుకు..
ఇక తుక్కుగూడ సభలో సీఎం రేవంత్.. తాను జానారెడ్డి అంత సుతిమెత్తగా ఉండనని చెప్పడానికి ఆయన పేరు తీసుకున్నారు. అయితే.. జానారెడ్డి పేరును ఉదహరించడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. గతంలో జానారెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారు. ఆయన పథకాలను ప్రశంసించారు. కాంగ్రెస్‌లో ఉంటూనే కేసీఆర్ అనుకూల వ్యాఖ్యలు చేశారు. రూ.5 భోజనం చేసి చాలా బాగుందని ప్రశంసించారు. ఒక దశలో జానారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ, ఆయన చేరలేదు. ఇప్పుడు అదే జానారెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఉదహరించడం హాట్ టాపిక్ అయింది.