CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో పయనిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయడానికి అనైతికంగా వ్యవహరించారు. 2014లో 62 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన కేసీఆర్.. మెజారిటీ తక్కువగా ఉందని, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ లోకి లాక్కున్నారు. అప్పుడు ప్రభుత్వం పడిపోకుండా ఉండేందుకు అలా చేశాడనుకున్నారు. కానీ, 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఈసారి 82 సీట్లు గెలిచారు. అయినా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా వాటిని పట్టించుకోకుండా కేసీఆర్ తాను చేయాల్సింది చేశాడు.
ఇప్పుడు రేవంత్..
ఇక తెలంగాణలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజులకే కాంగ్రెస్ కేసీఆర్ బాటను ఎంచుకుంది. గతంలో కేసీఆర్ చేశాడన్న కసా.. లేక, బలం పెంచుకోవడమా అనేది తెలియదు కానీ, మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ పాలకవర్గాలను కూల్చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం అస్త్రాన్ని సంధించి హస్తగతం చేసుకుంటోంది. ఇప్పటికే ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ ‘చేతి’కి చిక్కాయి. మరో ఐదారు ఈ వారం పది రోజుల్లోల చిక్కబోతున్నాయి. తాజాగా మంథని మున్సిపాల్ చైర్‌పర్సన్ పుట్ట శైలజపై అవిశ్వాసం అస్త్రాన్ని సంధించారు. మంథనిలో కాంగ్రెస్‌కు ఇద్దరు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. కానీ, బీఆర్‌ఎస్‌లోని కౌన్సిలర్లను మంత్రి శ్రీధర్‌బాబు తనవైపు తిప్పుకుని అవిశ్వాసం నోటీసులు ఇప్పించారు.
నాడు అనైతికమని..
నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కుంటే అనైతికమని హస్తం పార్టీ నేతలు గగ్గొలు పెట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్ముడు పోయారని సొంతపార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు. హైకోర్టులో పిల్ కూడా వేశారు. నాడు అనైతికమన్న నేతలే నేడు.. కేసీఆర్ తరహాలోనే బల్దియాల్లో వ్యవహరిస్తున్నారు. దీనిపై మళ్లీ విమర్శలు రాకముందే రేవంత్‌రెడ్డి పునఃపరిశీలన చేసుకోవాలని సూచిస్తున్నారు.