CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ గద్దెలు మొత్తం కూలాలని ఇటీవల వ్యాఖ్యలు చేశారు. గులాబీ పార్టీని వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలని పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలు ఏదో రాజకీయ వ్యవహారంలో చేసినవని అందరూ అనుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి వ్యాఖ్యల వెనుక లోతైన వ్యవహారం ఉందని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.
ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. ఆ తర్వాత ఒక్కరోజు గ్యాప్ లోనే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో గులాబీ పార్టీకి అర్థమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి ఆక్టివ్ అయింది. ఈసారి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సోమవారం రాత్రి సీఆర్పీఎస్ సెక్షన్ 160 కింద ఆయనకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు అధికారులు ఎదుట హరీష్ రావు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఏసిపి వెంకటగిరి ఈ నోటీసులను హరీష్ రావుకు అందించారు.
గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ జరిగిందని పదేపదే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. చివరికి కేసీఆర్ కుమార్తె కూడా ఫోన్ టాపింగ్ జరిగిందని చెబుతున్నారు. తన భర్త ఫోన్ ను కూడా వదిలిపెట్టకుండా దుర్మార్గంగా వ్యవహరించారని కవిత ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఫోన్ టాపింగ్ వ్యవహారంపై వేగంగా అడుగులు వేస్తోంది. ఫోన్ టాపింగ్ వల్ల గత ప్రభుత్వ పెద్దలు ఎలాంటి ప్రయోజనాలు పొందారు? నాటి ప్రభుత్వ పెద్దల కోసం పనిచేసిన వారు ఎలాంటి ఫలితాన్ని ఆశించారు? అనే విషయాలను బయట పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కృషి చేస్తుంది.
హరీష్ రావు కు సిట్ నోటీసు ఇవ్వడం సంచలనం కలిగించింది. ఈ కేసులో ముందుగా హరీష్ రావును, ఆ తర్వాత కేటీఆర్ ను, అనంతరం కేసీఆర్ ను విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. విచారణ అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే చాలామందిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. విచారణలో సేకరించిన సమాచారం తర్వాత హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. హరీష్ రావును విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తారని తెలుస్తోంది.
గతంలోనే తనకు నోటీసులు అందుతాయని హరీష్ రావు చెప్పారు.. పంచాయతీ ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తనకు కూడా ఇస్తారని హరీష్ రావు చెప్పారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండదని.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాత్రమే అది జరుగుతుందని హరీష్ రావు గతంలోనే వ్యాఖ్యానించారు.. ఇక ఈ వ్యవహారంలో ముందు నుంచి కూడా కేసీఆర్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఆయనను విచారిస్తారని.. దానికంటే ముందు నోటీసులు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది.
