CM Revanth Reddy: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. ఖమ్మం పట్టణాన్ని మున్నేరు ముంచేసింది. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ప్రజలు ఎక్కువగా బాధితులుగా మారారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో క్యాంపుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వసంమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. సోమవారం నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దీనిని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. సుమారు రూ.5 వేల కోట్ల నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు ఇవ్వాలని విన్నవించారు. వరద బాధిత ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున నిధులు కేతాయించారు. దీంతో యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.
రూ.100 కోట్ల విరాళం ప్రకటించిన ఉద్యోగులు..
తెలంగాణలోని వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ముందుకొచ్చింది. తమ ఒకరోజు బేసిక్ పేని సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. ఈ మొత్తం రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున రూ. కోటి, విశ్వక్‌సేన్ చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.
కేసీఆర్ రూ.2 వేల కోట్లు ప్రకటించాలి..
ఇక తెలంగాణ వరద బాధితులకు రూ.2 వేల కోట్లు ప్రకటించాలని సీఎం రేవంత్ సూచించారు. ఖమ్మం జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబం దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కేసీఆర్ రూ.2 వేల కోట్లు నిధులివ్వాలన్నారు. ఈ విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించాలని కోరారు. భారీ వరదల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. మిషన్ కాకతీయలో జరిగిన దోపిడీ వల్లే చెరువు కట్టలు తెగిపోయాయని సీఎం రేవంత్ ఆరోపించారు.