Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశాంతమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. రెండేళ్లుగా పాలన సాగిస్తున్న ఆయనకు తాజాగా కోపం వచ్చింది. ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై స్పష్టమైన ఆగ్రహం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సూచనలను నిర్లక్ష్యం చేస్తున్న విషయంపై సిబ్బందిని నేరుగా నిలదీసి, ‘‘ప్రభుత్వం చెబితే చేయడమే మీ పని, విస్మరిస్తే బాధ్యత వహించాలి’’ అనే వార్నింగ్ ఇచ్చారు.
గత నెలలో ప్రభుత్వ కార్యక్రమాల భాగంగా నిర్ణయించిన ‘పల్లె నిద్ర’ యాత్రలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయం సీఎం రేవంత్ దృష్టికి వచిచంది. దీంతో సీఎం తీవ్రంగా తప్పుపట్టారు. ఇది గ్రామస్థాయిలో ప్రభుత్వ పనితీరు పరిశీలనకు కీలకమైన కార్యక్రమం అయినప్పటికీ, కేవలం కొద్దిమంది కలెక్టర్లు మాత్రమే మైదానంలో చురుకైన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ములుగు జిల్లా కలెక్టర్ కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘‘ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం మీ బాధ్యత’’ అని సీఎం స్పష్టం చేశారు. ఆధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోతే, ఆ వ్యవస్థను తానే పర్యవేక్షించాల్సి వుంటుందని ఆయన ఘాటుగా చెప్పారు.
నెలవారీ నివేదిక ఇవ్వాల్సిందే..
ప్రభుత్వ ప్రణాళికలు అమలు దశలో నిర్లక్ష్యం కనపరిచిన వారిపై చర్యలు తప్పవని రేవంత్ గారు స్పష్టం చేశారు. ప్రతి శాఖా అధిపతి ప్రతీనెల చివరి వారంలో తనకు నివేదికలు సమర్పించాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని రికార్డ్‌లో ఉంచి, ప్రైవేట్ సంస్థల మాదిరిగా ఫలితాల ఆధారంగా అంచనా వేయాలని ఆదేశించారు. తడబాట్లుకు, ఆలస్యం చేయడానికీ స్థానముండదని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ విధానం అనేది విమర్శ కంటే పనితీరు మీద దృష్టి పెట్టిన సారథిగా చూడాలి. ప్రజా సంక్షేమానికి సదుపాయాలు అందించే లక్ష్యంతో ఆయన ఎల్లప్పుడూ పాలనా క్రమశిక్షణ, నిరంతర పర్యవేక్షణ, తక్షణ చర్య అనే మూడు సూత్రాలను ఆధారంగా తీసుకుంటారు. ఈ సారి ఆగ్రహం కూడా ప్రభుత్వ చైతన్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నముగా పరిగణించవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చాలనే లక్ష్యాన్ని ముందుంచింది. ఆ దిశగా వెళ్లాలంటే అధికారులు ప్రజలతో మమేకమై, ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతగా అమలు చేయాలని సీఎం నిపుణంగా సూచించారు. ఈ ఘటన ద్వారా ఆయన ఇచ్చిన సంకేతం ఒక్కటే. ప్రభుత్వం నిర్ణయించిందంటే అదే ధర్మం.