YS Rajasekhara Reddy: కడప : యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి.. తెలుగు ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహానేత. అభిమానులంతా వైయస్సార్ అనే పిలుచుకునే ఆయన 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజా రంజక పాలన అందించారు. కేవలం ఐదేళ్ల కాలంలోనే ఆయన తనదైన పాలనతో తెలుగు ప్రజల జీవితాల పై చెరగని ముద్ర వేశారు. ఆయన అకాల మరణంతో వారసత్వంగా సీఎం పదవిని ఆశించారు జగన్. కానీ హై కమాండ్ తిరస్కరించింది. దీంతో వైయస్సార్ కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది. జగన్ సొంతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు అదే కుటుంబం నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రాండ్ కోసం ఇద్దరూ తప్పిస్తున్నారు. గట్టిగానే పోరాడుతున్నారు.
* ప్రాథమిక స్థాయి నుంచి సేవాభావం..
ఈరోజు వైఎస్సార్ జయంతి. 1949 జూలై 8న రాజారెడ్డి, జయమ్మ దంపతులకు జన్మించారు రాజశేఖర్ రెడ్డి. కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్ చదివారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాక ముందు.. 1973లో తన తండ్రి పేరిట 70 పడకల చారిటబుల్ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా నాలుగుసార్లు, ఎమ్మెల్యేగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఓటమి ఎరుగని నేతగా ఆయనకు పేరుంది. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు స్నేహితులుగా మెలిగే వారు. 1983లో తొలిసారిగా పిసిసి చీఫ్ గా ఎన్నికయ్యారు రాజశేఖర్ రెడ్డి. మళ్లీ 1998లో ఆ బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి 2004 వరకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
* కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదిన నేత..
1994లో అధికారానికి దూరమైంది కాంగ్రెస్ పార్టీ. 1999లో చంద్రబాబు నేతృత్వంలో మరోసారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. ఆ సమయంలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు రాజశేఖర్ రెడ్డి. 2003లో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా 1467 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మొదలైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. అప్పట్లో టిడిపి ప్రభుత్వ విధానాలను విసిగిపోయిన ఏపీ ప్రజలు వైయస్ రాజశేఖర్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. నాడు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన రాజశేఖర్ రెడ్డికి ఆకర్షితులయ్యారు. 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సుదీర్ఘ విరామం తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమైంది. 2004 మే 14న ఈ రాష్ట్రానికి తొలిసారిగా సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు రాజశేఖర్ రెడ్డి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకంతో ప్రారంభమైన ఆయన పాలన ఎన్నో మెరుగైన పథకాలకు నాంది పలికింది. 2009లో రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. అయితే అదే ఏడాది సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమం కోసం హెలిక్యాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగింది. రాజశేఖర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయి మహానేత అయ్యారు.
* సంక్షేమ పథకాలకు ఆధ్యుడు..
ఏపీలో సంక్షేమ పథకాల కు నాంది పలికింది దివంగత నందమూరి తారక రామారావు. కానీ ప్రజాకర్షక, ప్రజోపయోగ పథకాలకు శ్రీకారం చుట్టింది మాత్రం రాజశేఖర్ రెడ్డి. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108 అంబులెన్స్ సేవలు వంటి వాటిని ప్రవేశపెట్టారు. ఏపీ ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు. అయితే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ఎంతో ఆరాటపడ్డారు రాజశేఖర్ రెడ్డి. కానీ ఆయన కుమారుడు సీఎం పదవి ఇవ్వలేదన్న కారణం చూపుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. వైసీపీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు. ఇప్పుడు అదే పార్టీ పగ్గాలు తీసుకున్నారు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల. తండ్రి ఆశయాల కోసం పని చేస్తానని చెబుతున్నారు. ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని శపధం చేస్తున్నారు. అదే సమయంలో తండ్రి వారసత్వం కోసం పిల్లలిద్దరూ గట్టిగానే పోరాడుతున్నారు. ఇప్పటికే తండ్రి పేరిట పార్టీని పెట్టి సక్సెస్ అయ్యారు జగన్. ఇప్పుడు తండ్రి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోనే ఉండి షర్మిల సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Children yearning for ys rajasekhar reddy legacy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com