BRS MLA Candidates: ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే బీఆర్‌ఎస్‌లో హడావుడి మొదలయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టారు. 2018లో కేక్ వాక్ లా ఉన్నట్టు ఇప్పుడు పరిస్థితి లేకపోవడంతో గులాబీ బాస్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈసారి తప్పించే అవకాశం ఉన్నట్ట సమాచారం. గతంలో పలుమార్లు నిర్వహించిన సమావేశాల్లో సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో కొంత మందికి టిక్కెట్ కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్తముఖాలు
ఈసారి సిట్టింగ్‌ల మార్పు ఖాయమనే నియోజకవర్గాల జాబితాలో పూర్వ వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, వరంగల్(తూర్పు)తో పాటు పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, కోదాడ, మునుగోడు, కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, రామగుండం, జగిత్యాల, కోరుట్ల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఖానాపూర్, ఖమ్మం జిల్లాలో వైరా, కొత్తగూడెం, ఇల్లెందు, పూర్వ మెదక్ జిల్లాలోని నర్సాపూర్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉప్పల్, ముషీరాబాద్, అంబర్‌పేటలోనూ కొత్త ముఖాలే రానున్నాయి.
వీరికి అవకాశం తథ్యం
ఉమ్మడి మెదక్‌లోని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి స్థానంలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్‌లో కోవా లక్ష్మి, ఖానాపూర్‌లో కేటీఆర్ బాల్యమిత్రుడు భూక్యా జాన్సన్ నాయక్‌కు, వేములవాడలో చెన్నమనేని రమేష్ స్థానంలో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు, వరంగల్ తూర్పు బరిలో నన్నపనేని నరేందర్ స్థానంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు, రామగుండంలో కోరుకంటి రవిచందర్‌కు బదులుగా సింగరేణి కార్మిక నేత లేదా మరో మహిళా నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ముషీరాబాద్, అంబర్‌పేటలో తెరపైకి ఎవరు రానున్నారనేది తేలాల్సి ఉంది.
హరీష్‌రావు అనుచరుడికి టిక్కెట్
మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌లో మాణిక్‌రావు స్థానంలో నరోత్తం లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. ఎర్రోళ్లకు టికెట్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు బలంగా కోరుతుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక ఖమ్మం జిల్లా వైరాలో మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటే మదన్‌లాల్ కూడా కాంగ్రెస్ లో చేరాల్సి ఉండగా.. వైరాలో అవకాశం ఇస్తామన్న బీఆర్‌ఎస్ ముఖ్యుల హామీతోనే మనసు మార్చుకున్నట్లు సమాచారం. ఇక మునుగోడులో గుత్తా అమిత్‌రెడ్డి, కర్నాటి విద్యాసాగర్ బలమైన పోటీదారులుగా ఉన్నారు.
అసంతృప్తులకు పదవులు
పూర్వ రంగారెడ్డి జిల్లాల్లో పట్నం బ్రదర్స్‌లో ఒకరైన పట్నం మహేందర్‌రెడ్డి తాండూరు టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతుండడంతో.. వచ్చే టర్మ్‌లో మంత్రి పదవి ఇస్తానని ఆయనకు సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధం కాగా.. ఆయనకు అధిష్ఠానం నచ్చజెప్పి వచ్చే టర్మ్‌లో ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తామని ఒప్పించినట్లు తెలిసింది. ఇక స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజయ్యను తప్పించి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. వేములవాడ సిటింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు కూడా ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వనున్నారు.