CM Revanth And Chandrababu: ఒకరేమో పొత్తుల కోసం కొద్దిరోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇంకో రేమో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇద్దరికీ క్షణం కూడా తీరికలేదు. పైగా ఎవరి రాజకీయాల్లో వారు బిజీ. అలాంటప్పుడు ఇద్దరు కలిశారని, గురు శిష్యులు మాట్లాడుకున్నారని, రెండు గంటల పాటు భేటీ జరిగిందని ఓ మీడియా రాసి పడేసింది. పైగా అక్కడ జరిగింది మొత్తం చూసినట్టు.. వారిద్దరూ మాట్లాడుకుంటే విన్నట్టు.. అచ్చు గుద్దింది. అసలే సోషల్ మీడియా కాలం.. ఇంకేముంది విపరీతంగా ప్రచారం అయింది. ఆ మీడియా హౌస్ కు కూడా కావాల్సింది అదే.. అసలే పార్లమెంట్ ఎన్నికలు కావడంతో ఓ పార్టీ దానిని విపరీతంగా సర్కులేట్ చేసింది. సీన్ కట్ చేస్తే ఆ వార్తను ప్రచురించిన మీడియా సంస్థపై కేసు నమోదయింది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల బేగంపేటలో ఎయిర్ పోర్ట్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారని.. సుమారు రెండు గంటల పాటు భేటీ అయ్యారని.. గురు శిష్యులు చాలా విషయాలపై మాట్లాడుకున్నారని.. ఓ పత్రిక రాసింది ( గతంలో అధికారిక పత్రికగా చలామణి అయింది).. అంతేకాదు అందులో సొంత వ్యక్తీకరణలు.. ఇంకా రకరకాల భాష్యాలకు దిగింది. సహజంగానే ఆ వార్త కాంగ్రెస్ పార్టీకి కోపం తెప్పించింది. దీంతో ఆ వార్త క్లిప్పింగ్ ను జతచేస్తూ ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మీడియా సంస్థపై 505(1), (బి), (సి),505(2), ఐపీసీ 109 కింద కేసు ఫైల్ చేశారు. దీంతో పోలీసులు ఆ మీడియా సంస్థకు నోటీసులు అందించారు..”మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది? ఆ ఇద్దరు వ్యక్తులు కలిసినట్టు మీకు ఎవరు చెప్పారు? మీరు అలాంటి వార్త ప్రచురించడం వల్ల రాష్ట్రంలో అధికార పార్టీ పరువుకు భంగం వాటిల్లింది. ముఖ్యమంత్రి బేగంపేట వెళ్ళనప్పుడు అలా ఎలా రాస్తారంటూ” పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
గతంలో అధికారిక పత్రికగా ఆ న్యూస్ పేపర్ వెలుగొందింది. అప్పట్లో ప్రతిపక్షాలపై అడ్డగోలుగా విమర్శలు చేసింది. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ప్రతిపక్ష స్థానం లో ఉంది. ఇప్పుడు అధికార పార్టీపై అడ్డగోలుగా వార్తలు రాస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో అడ్డగోలుగా రాతలు రాసిన ఆ పత్రిక.. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి కారణం అనే కోణంలో ప్రచారం చేస్తోంది. సహజంగానే ఆ మీడియా హౌస్ తీరు పట్ల అధికార పార్టీ ఆగ్రహం గా ఉంది. ముఖ్యమంత్రి మీద అడ్డగోలుగా వార్తలు రాసినందుకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి దీనిపై ఆ పత్రిక వద్ద ఎలాంటి ఆధారాలున్నాయి? ఒకవేళ ఆధారాలు లేకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానాలు లభించాల్సి ఉంది.