PM Kusum Yojana: కేంద్రం తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు ఇప్పటికే పీఎం సూర్యఘర్ యోజనను తీసుకువచ్చిన కేంద్రం ఈ పథకంలో కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకానికి ఇటీవలే రూ.74 వేల కోట్లు కేటాయించింది. ఇక తాజాగా తెలంగాణలో వ్యవసాయానికి కూడా సౌర విద్యుత్ వినియోగించుకునేలా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం పాతదే అయినా.. తెలంగాణలో దీని ద్వారా 20 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ముందుకు వచ్చింది.
పీఎం కుసుమ్ యోజన..
వ్యవసాయానికి సోలార్ పవర్ అందించేందుకే కేంద్రం పీఎం కుసుమ్ యోజన పథకం అమలు చేస్తోంది. ఈ ఏడాది తెలంగాణలో ప్రయోగాత్మకంగా 20 వేల వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయతీ కల్పిస్తామని కేంద్రం తెలిపింది.
29 లక్షల వ్యవసాయ కనెక్షన్లు..
తెలంగాణలో 29 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 10 కోట్ల యూనిట్లకుపైగా విద్యుత్‌ను డిస్కంలు సరఫరా చేస్తున్నాయి. దీనిని తగ్గించి సౌర విద్యుత్‌ను పెంచేందుకు కేంద్రం ప్రయోగాత్మకంగా పీఎం కుసుమ్ అమలుకు ముందుకు వచ్చింది.
విద్యుత్ సౌకర్యం ఉన్న బోర్లకు మాత్రమే..
పీఎం కుసుమ్ పథకంలో కాంపొనెంట్ సి విభాగం కింద ఒక్కో బోరుకు 5 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర ఫలకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే వ్యయంలో రైతులకు 30 శాతం రాయితీ ఇస్తామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే బోర్ల వద్ద సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఈ పథకం వర్తింపజేస్తారు. 30 శాతం రాయితీ ఇస్తారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను లైన్‌కు అనుసంధానించి నెట్ మీటర్ ఏర్పాటు చేస్తారు. బోరుకు ఉపయోగించిన విద్యుత్ యూనిట్లను తీసివేసి మిగతా మొత్తానికి యూనిట్‌కు రూ.3.13 చొప్పున రైతులకు తిరిగి చెల్లిస్తుంది.
ఎంత ఖర్చు అంటే..
బోరు మోటార్ వద్ద ఏర్పాటు చేసుకునే 5 కిలోవాట్ల సోలార్ విద్యుత్ యూనిట్‌కు రూ.2.5 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇందులో 30 శాతం అంటే రూ.75 వేల వరకు కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగతా రూ.1.75 లక్షలను రైతులు భరించాల్సి ఉంటుంది. రైతులను సోలార్‌వైపు మళ్లించేందుకు రాష్ట్రం కూడా కొంత రాయితీ ఇవ్వాలని కేంద్రం సూచించింది. రాష్ట్రం 20 శాతం రాయితీ ఇస్తే మొత్తంగా 50 శాతం సబ్సిడీ వస్తే రైతులు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది.
రైతుల గుర్తింపు..
తెలంగాణలో ప్రస్తుతం వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంటు ఇస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సోలార్ పవర్‌కు ఖర్చు పెట్టడానికి ముందుకే వచ్చే అవకాశం తక్కువ. అయితే ఆసక్తి, ఆర్థిక స్థోమత ఉన్నవారు ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో 38 ప్రాంతాల్లో ఇప్పటికే 5 వేల మంది రైతులు సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు టీఎస్ రెడ్కో గుర్తించింది. వీరికి కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగతా సొమ్ము రుణంగా ఇవ్వడానికి గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో సబ్‌స్టేషన్ల వారీగా సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునే రైతులను గుర్తించాలని డిస్కంలను కోరింది.