TS DSC: డీఎస్సీ వాయిదా వేయాలని తెలంగాణలో నిరుద్యోగులు చేస్తున్న పోరాటం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. మొన్న ఏబీవీపీ, నిన్న బీఆర్‌ఎస్‌వీ సంఘాలు జీడీఎస్‌పీఎస్సీ, ఉన్నత విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి యత్నించాయి. డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇవ్వాలని ఉద్యమించాయి. తాజాగా సోమవారం(జూలై 8న) డీఎస్సీ అభ్యర్థులే పోరుబాట పట్టారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు తరలి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు తాము చదువుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆందోళన చేశారు. విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు అందరినీ అరెస్టు చేశారు. ఉస్మానియా సిటీ కాలేజీలో గ్రౌండ్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో పురుషులతో పాటు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. దాదాపు పది గంటల పాటు సిటీ కళాశాల మైదానంలో నిర్బంధించారు. ఆహారం.. తాగునీరు లేక అల్లాడారు. పోలీసులు నిర్బంధంలో కొనసాగిన వారంతా రోడ్లపైకి వచ్చారు.
సాయంత్రం అయినా వదలని పోలీసులు..
ఇదిలా ఉంటే.. ఉదయం అరెస్టు చేసిన నిరసనకారులను పోలీసులు సాధారణంగా సాయంత్రం వదిలేస్తారు. డీఎస్సీ అభ్యర్థులను మాత్రం రాత్రయినా వదిలిపెట్టలేదు. అర్ధరాత్రి వరకు తమ నిర్బంధంలోనే ఉంచుకున్నారు. దీంతో నిరుద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అర్ధరాత్రి నిరసన దీక్షకు దిగారు. తమ ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
అర్ధరాత్రి పాదయాత్ర..
డీఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకుండా పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జూలై 11 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నిరసన కారులు అర్ధరాత్రి ఉద్యమానికి పిలుపునిచ్చారు. కిలోమీటర్లమేర పాదయాత్ర చేపట్టారు. అఫ్జల్‌గంజ్, నాంపల్లి మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. రహస్య కార్యాచరణ పెట్టుకున్న డీఎస్సీ అభ్యర్థులు తమ లక్ష్యం దిశగా సాగుతున్నారు. డీఎస్సీ వాయిదా వేసేదాకా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
వెనక్కి తగ్గని ప్రభుత్వం..
ఇదిలా ఉంటే… షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది. జూలై 18వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉంటాయని వివరించింది. జూలై 11వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.